Spirituality: షోడశోపచారాలలో ఒకటైన హారతి లేనిదే పూజ సంపూర్ణం కాదు. హారతి కళ్లకు అద్దుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ హారతిని ఎందుకిస్తారు. దానివెనుకున్న ఆధ్యాత్మిక - శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకుందాం...


​మనస్సు భగవంతుడిపై లగ్నమవుతుంది


ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు. ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినయంగా నమస్కరిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు. గంటలు, శంఖం శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది. ఫలితంగా  శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొంటుంది. శరీరంలో నూతన ఉత్తేజం వస్తుంది. 


Also Read: ఈ రాశులవారి మనసులో ఏమున్నా ఠక్కున బయపెట్టేస్తారు, మీరున్నారా ఇందులో!


హారతి వెనుకున్న ఆరోగ్యం


ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. దీంతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు  కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది.


భగవంతుడిపై మనసు లగ్నం చేయడమే


భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది. హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. కళ్లు మూసుకుని హారతిని అద్దుకోవడం ద్వారా మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా...ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి.


​హారతి వెనుకున్న శాస్త్రీయ కారణం


హారతి వెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే.. పళ్లెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించే హారతినిస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం. ఇందులో కల్తీ ఉండదు. కర్పూరానికి నిప్పును వెలిగించడం ద్వారా అద్భుతమైన సుగంద పరిమళాలతో కూడిన సువాసన వస్తుంది. ఈ సువాసన నలుమూలలా వెదజల్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఈ ప్రదేశమంతా సానుకూల వాతావరణం ఏర్పడి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తులు దూరమై అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే హారతి ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు.


Also Read: జ్యేష్ఠమాసం మొదలైంది - ఈ నెలలో ఎన్ని విశిష్ఠమైన రోజులున్నాయో తెలుసా!




కర్పూరంలో ఉండే అద్భుతమైన లక్షణం



కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం. రెండోది సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది దీనివెనుకున్న ఆంతర్యం. భక్తుడు ఎలాంటి కర్మ ఫలమూ మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ.. జీవించినంతకాలం జ్ఞానమనే ప్రకాశాన్నీ, సద్గుణాలు అనే సుగంధాలనీ వెదజల్లుతూ ఉండాలనీ పెద్దల అభిమతం కావచ్చు.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.