చాలామంది తమకు ఎంత ఆదాయం వచ్చినా కూడా అది నిలవడం లేదని, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చయిపోతోందని బాధపడుతుంటారు. ఎంత సంపాదించినా సరే బ్యాంక్ అకౌంట్ ఖాళీ గానే ఉంటుంది. ఏలాంటి పరిహారాలను పాటిస్తే సమస్యల నుంచి బయటపడొచ్చనేది గరుఢపురాణం వివరించింది. అవేమిటో తెలుసుకుందాం.
డబ్బుందన్న అహంకారం పనికిరాదు
ఎప్పుడూ సంపద చూసుకుని గర్వపడకూడదు. డబ్బున్న వాళ్లమని ఇతరులను ఎవరినీ అవమానించకూడదు, అగౌరవ పరచకూడదు. సంపద చూసుకుని గర్వపడే వారిపై కోపంతో లక్ష్మీ దేవి వెళ్లిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకుండా రూపాయి నిలవడం చాలా కష్టం. కాబట్టి డబ్బుందన్న అహంకారం అసలు పనికిరాదు. డబ్బు గర్వంతో ఇతరులను చిన్న చూపు చూడకూడదు.
ఇంట్లో తరచుగా రామాయణం, భారత, భాగవతాల వంటివి నిరంతరం పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరిస్తాయి. ఇలాంటి గ్రంథ పఠనం ద్వారా నిరంతరం ఇంట్లో భగవన్నామ స్మరణ చేస్తుంటారు ఫలితంగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
దాన ధర్మాలు
గరుడ పురాణం కూడా ఒకవ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి దానధర్మాలు చేయమని చెబుతోంది. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టించడం, అవసరం ఉన్న వారికి చేతి సాయం చెయ్యడం వంటి వాటి వల్ల పుణ్యం కలుగుతుంది. ఫలితంగా అనుకున్నవి సాధించగలుగుతారు. లక్ష్మీకటాక్షం కూడా దొరకుతుంది.
పితృదేవతారాధన
గరుడ పురాణాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ పితృదేవతలను ఆరాధించుకోవాలి. తెల్లవారు జామున నిద్ర లేచి స్నానాధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పితృదేవతలు, దేవుళ్ళను పూజించాలని గరుడ పురాణం చెబుతోంది.
స్నానం తర్వాతే వంట
వంట గది అత్యంత పవిత్రమైన ప్రదేశం. వంటగదిలోకి ఉదయం స్నానం తర్వాతే వంట చేసేందుకు వెళ్లాలి. వంట గదిలో వండిన ప్రతి వంటకం భగవంతుడికి అర్పించిన తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ ఆ ఇంటిని వదిలిపోదు.
ఆవుకు మేత వెయ్యాలి
ఇంట్లో వండిన ఆహారంలో మొదటి ముద్దను ఆవుకు, చివరి ముద్దను కుక్కకు పెట్టాలని గరుడ పురాణం చెబుతోంది. అందువల్ల లక్ష్మీ కటాక్షం మాత్రమే కాదు శని అనుగ్రహం కూడా లభిస్తుంది.
మరి కొన్ని నియమాలు
- సంధ్యా సమయంలో ఇల్లు ఊడ్చ కూడదు
- ఇల్లు శుభ్రం చెయ్యకుండా ఉదయం టిఫిన్ తినకూడదు.
- ఇల్లు శుభ్రం చెయ్యకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు.
- పరగడుపున బయటకు వెళ్ళల్సి వస్తే ఒక స్పూన్ పెరుగు తిని వెళ్ళాలి.
- గురువారం పూట తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
- ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రం చేసుకోవాలి. సాలేగూళ్లు, మట్టి చెత్త విరిగిపోయిన వస్తువులను ఇంట్లో నుంచి బయట పడేయ్యాలి.
- సింహద్వారం దగ్గర చెప్పులు చిందరవందరగా వదలకూడదు.
- ఇంటి గడప లక్ష్మీతో సమానం కనుక ద్వార లక్ష్మీ అని సంభోధిస్తారు. ప్రతి శుక్రవారం ఇంటి గడపకు, తులసి కోటకు పసుపు రాసి బొట్టు పెడితే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. అనుకువ కలిగిని కోడళ్లు, సమర్థులైన అల్లుళ్లు లభిస్తారు.
- పసుపు కుంకుమతో ఉన్న లోగిళ్లు లక్ష్మి కి ఆహ్వానం పలుకుతాయి.
Also Read: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? లక్ష్మీదేవి కటాక్షించబోతోందని అర్థం!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.