ఆచార్య చాణక్యుడు ఎంత గొప్ప విద్యావేత్తో అంతే పెద్ద రాజకీవ వేత్త కూడా. అంతే కాదు ఆయన బోధించిన నీతులు ఇప్పటికీ జీవితానికి ఒక మంచి దారి చూపి దిక్సూచిగా పనిచేస్తాయని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. జీవితాన్ని విజయపథంలో నడిపించేందుకు చాణక్య బోధనలు చాలా ఉపయోగకరం. విజయం అందించే అనేకానేక రహస్యాలు చాణక్యనీతి పేరుతో నేటికీ ప్రాచూర్యంలో ఉన్నాయి. జీవితంలోని ప్రతి సందర్భంలో ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో తన నీతి శాస్త్రంలో చర్చించాడు.


చాణక్యుడు చెప్పిన దాన్ని బట్టి ప్రతి వ్యక్తికి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలే మన విజయానికైనా, అపజయానికైనా కారణం అవుతాయి. అయితే విజయాలు ఎల్లప్పుడు సొంతం కావాలంటే మాత్రం చాణిక్యుడు చెప్పిన ఈ నాలుగు లక్షణాలు తప్పకుండా మీలో ఉండాలి. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం.


ఇతరులతో సత్సంబంధాలు


ఇతరులతో ప్రవర్తించే విధానమే మన విజయానికి మొదటి మెట్టు. మనం అందరితో ఆప్యాయంగా ఉంటే అందరూ మనల్ని ఆదరిస్తారు. చుట్టూ ఉండే వారు ఆనందంగా ఉంటే మనమూ ఆనందంగా ఉండొచ్చు. చుట్టూ ఆనందాలు ఉన్నపుడు పనిలో ఆటంకాలు పెద్దగా కలగవు. ఫలితంగా విజయం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది.


కోపం వద్దు


కోపం మనలోని విచక్షణను నశింపజేస్తుంది. కోపం వల్ల పనులు చెడిపోతాయి. కోపం మానసిక ఒత్తిడి పెంచుతుంది. ఇతరులతో సంబంధాలను పాడు చేస్తుంది. కోపంతో ఉన్న వ్యక్తి వల్ల పక్కవారికి హాని జరిగుతుందన్న నమ్మకం లేదు కానీ కోపంలో ఉన్న వ్యక్తికి మాత్రం తప్పక హాని జరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి కోపం వస్తున్న నిమిషంలో దాన్ని గుర్తించి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.


వాదనలతో లాభం లేదు


మూర్ఖుడితో వాదించడం వల్ల ఎప్పుడూ మన స్థాయి దిగజారుతుందని గుర్తుంచుకోవాలి. సమయం, శక్తి వృథా తప్ప ఎటువంటి లాభం ఉండదని గమనించుకోవాలి. కొందరి వ్యక్తిత్వాలలో కొన్న లక్షణాలు జన్మతహా వస్తాయి అవి వాదాలతో మారవని మరచిపోవద్దు. ఎవరికి వారు నియంత్రణలో ఉండడాన్ని సాధన ద్వారా సాధించుకోవాలి.


ఇతరులకు సహాయం చేసే అవకాశం వచ్చినపుడు అది మన వీలును అనుసరించి తప్పనిసరిగా సహాయ పడాలి. సహాయ పడే గుణం సహజంగానే వ్యక్తుల్లో ఉంటుందని వ్యక్తులు తమలో ఉన్న ఆగుణాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా పెంపొందించుకోవాలి. ఈ గుణం పెంచుకుంటే ఆత్మతృప్తి పెరుగుతుంది. పనిలో హడావిడి తగదు. సహనం అత్యంత ఉత్తమమైన గుణం. పరిస్థితులు అనుకూలంగా లేనపుడు సహనంతో వ్యవహరించడం చాలా అవసరం.


విజయానికి ఈ నాలుగు విషయాలే కాదు ఇంకా చాలా విషయాలు చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు. ఇవి సర్వకాల సర్వాస్థలలో పాటించదగినవే. చాణక్యుడిని బోధలను అనుసరిస్తే అపజయం ఉండదనేది అనుమానం లేని విషయం. ఇక్కడ చెప్పుకున్న ఈ నాలుగు విషయాలు చాలా సులభంగా ఆచరణీయమే వీటిని అనుసరించి విజయాలు పొందవచ్చు.


గమనిక: శాస్త్రాలు, పండితులు, పురాణాల్లో చెప్పిన విషయాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులోని అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.