Ranganatha Swamy Temple in Vanaparthi: శ్రీవైష్ణవ వైభవానికి పట్టుగొమ్మలా వెలుగుతోన్న క్షేత్రం శ్రీరంగం. 108 దివ్యదేశాల్లో పవిత్రమైన ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. కోయిల్ అంటే శ్రీరంగం, మలై అంటే తిరుమల అంటారు. శ్రీరంగాన్ని పెరియకోయిల్ అని కూడా అంటారు. అంటే పెద్ద దేవాలయం అని. శయనమూర్తిగా పూజలందుకునే శ్రీరంగనాథుడి దర్శనార్థం భక్తులు భారీగా తరలి వెళుతుంటారు..అయితే ఇంచుమించు అలాంటి ఆలయమే తెలంగాణ రాష్ట్రం వనపర్తిలో ఉంది. నటుడు సిద్దార్థ్, హీరోయిన్ అదితి ఈ ఆలయంలో పెళ్లిచేసుకోవడంతో ఈ టెంపుల్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారంతా..
Also Read: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సిద్ధూ, అదితి - ఆ గుడిలోనే ఎందుకు అంటే?
శ్రీ రంగనాథుడే ఈ రంగనాథుడు
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో కొలువయ్యాడు ఉన్న రంగనాథుడి ఆలయం దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మించారని చెబుతారు. వనపర్తి సంస్థానాధీశుడైన బహిరి అష్టబాషి గోపాలరావు15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కట్టించారు. దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా శ్రీరంగం చేరుకున్న సంస్థానాధీశుడు అక్కడ ఆలయాన్ని, స్వామివారిని చూసి పరవశించిపోయాడు. శ్రీ రంగనాథుడి ఆలయ నిర్మాణం, శిల్పకళకు ముగ్ధుడై సంవత్సరానికి ఓసారి రంగనాథుడి దర్శనానికి వెళ్లి వస్తుండేవారు. ఓ ఏడాది ఆరోగ్యం సహకరించకపోవడంతో రంగనాథస్వామిని దర్శించుకోలేదు. అప్పుడు రాజుగారి కలలో కనిపించిన రంగనాథుడు... సంకిరెడ్డిపల్లి గ్రామ అడవిలో ఉన్న పుట్టలో నేను కొలువుదీరి ఉన్నాను అని చెప్పాడు. అలా పుట్టలోంచి బయటపడిన విగ్రహాన్ని తీసుకొచ్చి శ్రీరంగాపురంలో ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారు. శ్రీ రంగాపురంలో ఉన్న స్వామివారి రూపమే ఇక్కడ కూడా కనిపించడం వల్లే ఉత్తర శ్రీరంగంగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించిన వనపర్తి సంస్థాన రాజవంశీయుల ఆధ్వర్యంలోనే ఏటా తొమ్మిది రోజుల పాటూ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ఆలయ నిర్మాణం అద్భుతం
తమిళనాడు తంజావూరు, తిరుచునాపల్లి , కంచి, తిరువనంతపురం నుంచి తీసుకొచ్చిన శిల్పులు ప్రత్యేకంగా చెక్కారు. ఆలయంలోకి అడుగుపెట్టేముందు పెద్ద రాజగోపురం కనిపిస్తుంది. ఐదు అంతస్తులతో 60 అడుగుల ఎత్తు, 20 అడుగుల ద్వారంతో నిర్మించారు. మొదటి అంతస్తులో రామాయణం, క్షీరసాగర మధనం, శ్రీకృష్ణుడి జీవితం, ఉగ్ర నరసింహావతారం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి.. దేవతామూర్తుల విగ్రహాలు చెక్కారు. రాజ గోపురంపై బంగారు పూతతో కూడిన ఏడు కలశాలు కనిపిస్తాయి. చిన్న గాలి గోపురం కూడా మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఇంకా శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా గోడలపై దర్శనమిస్తాయి. ఆలయానికి వెనక వైపు మూడు అంతస్తుల్లో తంజావూరు చిత్రపటాలున్నాయి. శ్రీరంగంలో ఉండే కావేరి నదిలాగే శ్రీరంగపురం రంగనాథస్వామి ఆలయం చుట్టూ నది లాంటిది ఉండాలని రాణీ శంకరమ్మదేవి ఆలయం చుట్టూ రంగ సముద్రాన్ని తవ్వించారు. ఆ మధ్యలో ‘కృష్ణ విలాస్’ అనే భవనాన్ని నిర్మించారు.. ఈ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. వైకుంఠ ఏకాదశి రోజున ఆలయ ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. ఈ దర్శనం తర్వాత పదిరోజుల పాటు ప్రతి రోజు సాయంత్రం అధ్యయనోత్సవాలు జరుగుతాయి. తిరుపతిలో జరిగినట్టే వాహన సేవలుంటాయి.