Zomato Shares Hits All-time High: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తీసుకొచ్చి ఇచ్చే ఆహారం అందరికీ నచ్చుతుందో, లేదా గానీ.. ఈ కంపెనీ షేర్లు మాత్రం పరమ ప్రియంగా మారాయి. జొమాటో షేర్లు ఈ రోజు (బుధవారం, 27 మార్చి 2024) కూడా చారిత్రక గరిష్టాన్ని తాకాయి. రూ.188.95 దగ్గర జీవితకాల గరిష్ట స్థాయికి (Life-time high) చేరాయి.
జొమాటో షేర్లు మంగళవారం కూడా రికార్డ్ ట్రెండ్ ఫాలో అయ్యాయి, అంతకుముందున్న గరిష్టాన్ని బద్ధలు కొట్టి రూ.183.65 కు చేరాయి. మార్కెట్ ముగిసే సమయానికి 4.82 శాతం జంప్‌తో రూ. 182.60 వద్ద ముగిశాయి. దీంతో జొమాటో మార్కెట్ క్యాప్ కూడా రూ.1.61 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ రికార్డ్ ఒక్క రోజులోనే (ఈ రోజు) తుడిచిపెట్టుకుపోయింది.
పండగ చేసుకున్న జొమాటో
హోలీ పండుగ జొమాటోకు చాలా అద్భుతంగా గడిచింది. వినియోగదార్లు జొమాటో యాప్ ద్వారా కిలోల కొద్దీ స్వీట్లను ఆర్డర్ చేశారు. జొమాటోకు చెందిన ఆన్‌లైన్ కిరాణా యాప్ బ్లింకిట్‌లోనూ (Blikint) కస్టమర్లు హోలీ షాపింగ్ చేశారు. తెల్లటి దుస్తులు మొదలు వాటర్ గన్‌లు, రంగులు, మిఠాయిల వరకు వేల సంఖ్యలో ఆర్డర్లు పెట్టారు. జొమాటో, బ్లింకిట్‌లో వెల్లువెత్తిన ఆర్డర్ల ప్రభావం జొమాటో షేర్లలో కనిపిస్తోంది.
జొమాటో వ్యాపారం భవిష్యత్‌లో బలంగా ఉంటుందని పెట్టుబడిదార్లు నమ్మడం, గ్లోబల్ రేటింగ్ కంపెనీలు ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్‌లను పెంచడంతో ఈ షేర్లకు చాలా డిమాండ్ కనిపిస్తోంది. కొంతకాలంగా జొమాటో స్టాక్ పైపైకి పరుగులు పెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4 FY 2023-24) జొమాటో గొప్ప ప్రదర్శన చేస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది.
జొమాటో షేర్ల టార్గెట్ ధర
జొమాటో స్టాక్‌ను రూ.227 టార్గెట్ ధరతో (Zomato Shares Target Price) కొనుగోలు చేయాలని విదేశీ బ్రోకరేజ్ సంస్థ CLSA పెట్టుబడిదార్లకు సూచించింది. జెఫరీస్ స్టాక్ టార్గెట్ ప్రైస్‌ను రూ.205 గా ప్రకటించింది. దీనిని బట్టి జొమాటో మారథాన్ ఇప్పట్లో ఆగేలా లేదని మార్కెట్ అభిప్రాయపడుతోంది.
సరిగ్గా సంవత్సరం క్రితం, 28 మార్చి 2023న, జొమాటో షేర్ ధర రూ. 49 వద్ద ట్రేడయింది. IPO ధర రూ. 76 కంటే ఇది చాలా తక్కువ. ఓడలు బండ్లు - బండ్లు ఓడలు అయిన చందాన... ఒక్క ఏడాదిలోనే పరిస్థితి చాలా మారింది. జొమాటో ప్రకటించిన అద్భుతమైన త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ కంపెనీ మీద పెట్టుబడిదార్ల విశ్వాసం అమాంతం పెరిగింది. జొమాటో స్టాక్ కోసం బయ్ ఆర్డర్స్ పెరిగాయి, షేర్లు పరుగులు పెట్టాయి. ఫలితంగా, జొమాటో స్టాక్ తన పెట్టుబడిదార్లకు అద్భుతమైన రాబడి ఇచ్చింది.
జొమాటో షేర్లు గత 12 నెలల కాలంలో (ఏడాదిలో) దాదాపు 268% శాతం రాబడిని ఇచ్చాయి. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 84% పెరిగింది, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 48% రాబడి ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ప్రపంచంలో టాప్-10 ధనవంతులు వీళ్లే, భారత్ నుంచి ఒకే ఒక్కడు