రాముడంటే మర్యాద పురుషోత్తముడు. రాజ ధర్మాన్ని, క్షత్రీయ ధర్మాన్ని, మానుష ధర్మాన్ని మానవ సమాజానికి ఆచరించి చూపిన ఆదర్శప్రాయడు. అందుకే, హిందువులు అంతగా ఆరాధిస్తారు. అయోధ్యలో రామ మందిరంలో ఆయన కొలువై ఉండగా చూడాలనేది ఎంతోమంది కల. ఎట్టకేలకు ఆ కల నెరవేరే రోజు వచ్చేస్తోంది. అది కనులారా చూసేందుకు ఎంతో మంది భక్తులు అయోధ్యకు బయల్దేరుతున్నారు. మీరు కూడా అక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే, ముందుగా ఈ నియమ నిబంధనలు గురించి తెలుసుకోంటే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీరామ్ లల్లా దర్శనం చేసుకోవచ్చు.


అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామ మందిరం అయోధ్యలో జనవరి 22, 2024 న ప్రారంభించబోతున్నారు. రామభక్తులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భం. అయోధ్యలో అణువణువున శ్రీరాముడుంటాడని నమ్మకం. అందుకే అయోధ్య ఎప్పుడూ చర్చలో ఉంటుంది. రాముడు పుట్టింది ఇక్కడే అయినప్పటికీ 500 సంవత్సరాలుగా రాముడికి ఇక్కడ చోటు దొరకలేదు. ఇన్నాళ్ల అజ్ఞాతం తర్వాత ఇప్పుడు తిరిగి రాముడు ఈ నేలమీద అడుగు పెడుతున్నాడు. అందుకే ఈ ఉత్సవం రామభక్తులకు అత్యంత ఉద్వేగ భరితం. ఆలయంలో జరిపే విగ్రహ ప్రాణప్రతిష్ట చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. దీన్ని చూసేందుకు భారీ సంఖ్యలో రామభక్తులు అయోధ్య చేరుకుంటున్నారు. ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి.


అయోధ్యలో భక్తులు పాటించాల్సిన రూల్స్ ఇవే:


జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లాలని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.



  • ఆలయ ప్రాంగణంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అనుమతించరు. కనుక వాటిని తీసుకుపోవద్దు.

  • మొబైల్, ఎలక్ట్రానిక్ వాచి, ల్యాప్ ట్యాప్, కెమెరా వంటి వస్తువులేవీ తీసుకు వెళ్ల కూడదు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.

  • తినుబండారాలు, పానీయాలు ఏవీ కూడా ఆలయ ప్రాంగణంలోకి అనుమతించరు.

  • ఇంటి వంటకాలైనా, ఫాస్ట్ ఫూడ్ అయినా సరే ఎటువంటి తినుబండారాలను, పానీయాలకు ఆలయంలోకి అనుమతి లేదు.

  • బూట్లూ, బెల్ట్ వంటి వస్తువులు ధరించి ఆలయంలోకి ప్రవేశం నిశిద్ధం. వీటిని ప్రవేశద్వారం వద్దే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది.

  • చాలా మందికి ఆలయానికి వెళ్లే సమయంలో హారతి పళ్లేం తీసుకువెళ్లే ఆచారం ఉంటుంది. కానీ జనవరి 22న జరిగే కార్యక్రమానికి మాత్రం హారతి పళ్లెం తీసువెళ్లకూడదు. ఎందుకంటే ఎలాంటి పూజకు మీకు అనుమతి ఉండదు. కనుక అది తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు.

  • ఆహ్వాన పత్రిక ఉన్నవారికి మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉంటుంది. ఆహ్వాన పత్రిక లేకుండా ఆలయ ప్రవేశం చేసే అనుమతి లేదు. కనుక పత్రిక లేకుండా ఆలయంలో ప్రవేశించే ప్రయత్నం చెయ్యకపోవడమే మంచిది.

  • రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు తప్పకుండా సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. అలాంటి వారికి మాత్రమే అనుమతి లభిస్తుంది. అయితే డ్రెస్ కోడ్ గురించి ప్రత్యేక నియమం లేదు. అయినప్పటికీ సంప్రదాయ దుస్తులు ధరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • అయోధ్య రామ మందిరాన్ని జనవరి 22న సందర్శించాలంటే చాలా కష్టం. వీఐపీల రాకపోకల వల్ల సామాన్యులకు దర్శన భాగ్యం అంత సులభం కాదు. కాబట్టి.. మరొక రోజును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.


Also read : సిమెంట్, ఇనుము లేకుండా అయోధ్య రామాలయం నిర్మాణం - ఆ రాయికి అంత ప్రత్యేకత ఉందా?