Happy Easter 2024 : భూలోకంలో ఆవిర్భవించిన ఏసు క్రీస్తు మహిమలు ఏవీ ప్రదర్శించకుండా సాదా సీదా వ్యక్తిలా ప్రాణాలు అర్పించాడు. అలా ప్రాణాలు అర్పించిన రోజే గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత  దైవశక్తితో పునరుత్థానం పొందాడు...అదే ఈస్టర్‌. ఏసుక్రీస్తును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ జరుపుకుంటారు. అంటే ఏసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానం పొందడానికి సూచన. మరణం అంతం కాదని పాప విముక్తి కొత్త జీవితానికి ఇది నాంది అనే సందేశాన్నిస్తుంది ఈస్టర్.  ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ ఫిక్స్ అని అందరికీ తెలుసు కానీ... క్రిస్మస్ లా ఈస్టర్ కు నిర్ధిష్టమైన తేదీ లేదు. ఏటా మారుతూ ఉంటుంది. గ్రెగోరియన్ క్యాలెండర్‌లో ఈస్టర్ పండుగ మార్చి 22 నుంచి ఏప్రిల్ 25 మధ్య వస్తుంది. అయితే జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ ఏప్రిల్ 8- మే 8 మధ్య వస్తుంది. ఈ ఏడాది ఈస్టర్ మార్చి 31 ఆదివారం వచ్చింది.


Also Read: Good Friday 2024 Date: గుడ్ ఫ్రైడే ఎప్పుడు , ఆంతర్యం ఏంటి - ఈ రోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పరు!


చెడుపై మంచి సాధించిన విజయం


మానవాళిని పాపాల నుంచి విముక్తులను చేసేందుకు తనని తాను త్యాగం చేసుకున్న క్రీస్తు..తిరిగి వచ్చిన రోజు. ఇదే ఏసుని నిజమైన దేవుడిగా గుర్తించిన రోజు. చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని చెప్పడమే ఈస్టర్ ఆంతర్యం. అందుకే సంబరంగా వేడుకలు జరుపుకుంటారు. ప్రార్థనలు చేస్తారు, అంతా కలసి విందులో పాల్గొంటారు. ఈస్టర్ గుడ్లను అలంకరించడం వాటిని తమ ఆత్మీయులకు పంపిణీ చేయడం ముఖ్యమైన ఘట్టం. ఎగ్ రోలింగ్, ఎగ్ ట్యాపింగ్, ఎగ్ డెకొరేషన్ వంటి సాంప్రదాయ ఈస్టర్ గేమ్‌లు ఆడతారు. ఈస్టర్ సండే నుంచి మొత్తం వారాన్ని హోలీ వీక్ అంటారు. 


సంతానోత్పత్తికి సూచన


ఈస్టర్ క్రైస్తవుల పండుగ అయినప్పటికీ ఇతర మతాల వారు కూడా జరుపుకుంటారు. వసంతకాలంలో వచ్చే ఈ  వేడుకను సంతానోత్పత్తి, పునర్జన్మ కు సూచనగా భావిస్తారు. కుటుంబం మొత్తం కలసి ఆనందాన్ని పంచుకునే సందర్భంగా మలుచుకుంటారు. క్రైస్తవ మతం జుడాయిజంలో ప్రారంభమైంది. జెరూసలేం నగరానికి యేసు రాజు వచ్చిన జ్ఞాపకార్థం పామ్ సండేతో ఈ సందడి ప్రారంభమవుతుంది...తర్వాత వారం మౌండీ గురువారం, గుడ్ ఫ్రైడే శుక్రవారం...ఆ తర్వాత వచ్చే సండే ఈస్టర్ జరుపుకుంటారు. 


Also Read: ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా ఈ ఉగాది నుంచి తిరుగులేదంతే - శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు!


సన్ రైజ్ సర్వీసెస్ 


లోక రక్షకుడు ఉదయించాడు అనేందుకు గుర్తుగా చాలా చర్చిల్లో   సూర్యోదయ సేవలు పేరుతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. క్రీస్తు త్యాగానికి    గుర్తుగా ఈస్టర్ లిల్లిలతో...చర్చిలను, ఇళ్లను అందంగా అలంకరిస్తారు. 


ఈస్టర్ చుట్టూ ఎన్ని వేడుకలో


ఈస్టర్ చుట్టూ చాలా వేడుకలున్నాయి. ఆష్ వెడ్నెస్ డే (ఫస్ట్ డే ఆప్ లెంట్) గా పిలిచే మొదటి బుధవారం అంటే క్రీస్తు ఎడారిలో చేసిన 40 రోజుల ఉపవాసదీక్షకు గుర్తుగా ఈ 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాస దీక్షలు చేస్తారు..తమకు చాలా ఇష్టమైన ఒక పదార్థాన్ని విడిచి పెడతారు.  పామ్ సండే అంటే ఏసు క్రీస్తు  జెరుసలేంలోకి ప్రయాణించిన మెస్సియగా మారిన రోజు. ఆ తర్వాత వచ్చే గుడ్ ఫ్రైడే అంటే ఏసుని శిలువ వేసిన రోజు.. ఈ పండుగలన్నీ ఈస్టర్ కు అనుసంధంగా జరుపుకునేవే. 


Also Read:  శ్రీ క్రోధి నామ సంవత్సరం ఈ రాశివారికి యోగకాలం - ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవ్!


గుడ్ ఫ్రైడే రోజు శుభాకాంక్షలు చెప్పకూడదు కానీ...ఈస్టర్ రోజు సంతోషంగా విశెష్ చెప్పుకోవచ్చు.  మార్చి 31న ఈస్టర్ సందర్భంగా మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు  శుభాకాంక్షలు తెలియజేయండి.