Guntakallu Mary Matha Church: క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసుప్రభువు(Jesus Christ)కు జన్మనిచ్చిన పవిత్ర మాతృమూర్తి మేరీ మాత.  దైవానికే జన్మనిచ్చిన మేరీ మాత(Mary Matha)ను దర్శించుకోవాలంటే దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన  తమిళనాడు(Tamilnadu)లోని వేళంగినికి వెళ్లాలి. గుంతకల్లు పరిసర ప్రాంతాల నుంచి 24 గంటల ప్రయాణం చేస్తే గాని వేళంగినికి చేరుకోలేం. అది కూడా అత్యంత వేగంగా పరిగెత్తే రైళ్ళలో ప్రయాణిస్తేనే ఇంత సమయం పడుతుంది. అదే రవాణా వ్యవస్థ అంతంత మాత్రమే ఉండే 140 సంవత్సరాల క్రితం అయితే అప్పటి పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. దీంతో భక్తులు ఆమె దర్శనానికి వెళ్లాలంటే తీవ్ర వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వచ్చేది. అసలే గుంతకల్లులో ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువ. వారు ఆరాధించేది కూడా మేరీ మాతనే. ఈ పరిస్థితులను గమనించిన అప్పటి బ్రిటిష్ పాలకులు గుంతకల్లు(Gunkakallu) రైల్వే స్టేషన్ సమీపంలో మేరీమాత చర్చి నిర్మించారు. ఇటు పట్టణ ప్రజలకు ఆటో రైల్వే ఉద్యోగులకు అనుకూలంగా చర్చి నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రార్థనా మందిరాన్ని వివిధ మతాలకు చెందిన పలువురు దర్శించుకుంటున్నారు. 


నీలిరంగు కళ్లతో ఓ చిన్నారి దర్శనం 


1998లో ఓ అద్భుతం జరిగిందని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇద్దరు హైందవ మతానికి చెందిన చిన్నారులు చర్చి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా, వారి వయస్సే  కలిగిన నీలిరంగు కళ్లతో ఓ చిన్నారి రూపంలో వారికి దర్శనం  కలిగింది. ఆ పక్కనే గాజు షోకేస్ లో ఉన్న మేరీ మాత విగ్రహం(Mary Matha Statue) కళ్లు తెరిచిందని, దీంతో వెంటనే అద్దాలు పగిలిపోయి నిప్పురవ్వలు వచ్చాయని అక్కడి భక్తులు చెబుతుంటారు. నిప్పురవ్వలు రావడంతో ఓ చిన్నారి మూర్ఛ పోయాడని, నీలి రంగు కళ్లు కలిగిన చిన్నారి మాత్రం అప్పుడే అదృశ్యమయ్యాడు.  దీంతో చిన్నారి రూపంలో మేరిమాత దర్శనమిచ్చింది అనేది అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అప్పటి నుంచి  మేరీ మాత ఆలయం ప్రభ దశదిశలా వ్యాపించింది. అనేక రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు చెందిన రోమన్ క్యాథలిక్(Roman Catholics) లు గుంతకల్లు మేరీ మాతను  దర్శించుకోవడం పెరిగిపోయింది. దీంతో చిన్నగా ఉన్న పురాతన  ప్రార్థనా మందిరం స్థానంలో వేళంగినిలో ఉన్న మేరీమాత ఆలయం తరహాలోనే అతిపెద్దగా నిర్మించారు. 


ఆర్యోగ మాతగా ప్రసిద్ధి


ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదో తారీకున మేరీమాత జన్మదిన వేడుకలను ప్రార్థనా మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఆగస్టు 4వ తేదీన మేరీ మాత దర్శనమిచ్చిన కారణంగా కూడా వేడుకలు నిర్వహిస్తారు. క్రిస్మస్ వేడుకల సంబరాలు సైతం వైభవోపేతంగా,  కన్నుల పండుగగా నిర్వహించడం పరిపాటి. అలాగే  ప్రత్యేక దుస్తులలో శ్రమ దినాలు పాటించడం ఇక్కడి క్రైస్తవుల ప్రత్యేకత. ఆరోగ్య మాత గా పిలిచే మేరీ మాతను దర్శించుకుని ఆరోగ్య సమస్యలను,  మానసిక రుగ్మతలను ప్రార్థన రూపంలో నివేదించుకొని  సంపూర్ణ ఆరోగ్యవంతులవుతున్నారు. దీంతో ప్రార్థనా మందిరానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. తమ కోరికలు తీరిన తర్వాత చీరలు, బంగారు ఆభరణాలు మేరీ మాతకు ఇచ్చి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి సంప్రదాయం. సాధారణంగా క్రైస్తవులు(Christians) కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థన చేస్తారు. కానీ గుంతకల్లు మేరీ మాత ఆలయంలో పూలు, ఊదిబత్తిలు‌, టెంకాయలు సమర్పించి ప్రార్ధించడం ఇక్కడి సంప్రదాయం. ఈ ప్రార్థనా మందిరం ప్రాంగణంలోనే చర్చి స్కూల్ పేరుతో పాఠశాలను కూడా అనేక దశాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారు. అలాగే  కుష్టు వ్యాధి సోకిన వ్యాధిగ్రస్తులను ప్రత్యేకంగా నిర్మించిన గదులలో ఉంచి వారి అవసరాలను  దేవాలయ సిబ్బంది తీరుస్తుంటారు.