Reason For Lakshmi Angry: లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సులకు దేవత. మహాలక్ష్మి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఎంత పేదవాడైనా, లక్ష్మీదేవి అనుగ్రహంతో క్షణంలో రాజు అవుతాడు. మరోవైపు, ఆమెకు కోపం వస్తే, రాజు కూడా పేదవాడిగా వీధిన పడటానికి ఎక్కువ సమయం పట్టదు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఎప్పుడూ తగ్గకూడదని అందరూ కోరుకుంటారు. కానీ తెలిసో తెలియకో చేసే పొరపాట్ల కారణంగా మహాలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించదు. మరి లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమయ్యే పనులు ఏమిటో తెలుసుకోండి. మీరు వాటిని చేయకుండా జాగ్రత్త వహించండి.
వంటగదిలో శుభ్రం చేయని పాత్రలు
వంటగదిలో శుభ్రం చేయని పాత్రలు పేదరికానికి దారితీస్తాయి. వంటగదిలో శుభ్రం చేయని పాత్రలను ఉంచకూడదని శాస్త్రాలలో పేర్కొన్నారు. కానీ సాధారణంగా చాలా ఇళ్లలో గిన్నెలు తోమకుండా రాత్రంతా సింక్‌లో వదిలేసి ఉదయాన్నే శుభ్రం చేస్తుంటారు. ఇలాంటి పనులు చేసే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని పెద్దలు చెబుతారు.
ఈ సమయంలో చెత్త బయట పడేయకండి
సూర్యాస్తమయం తర్వాత ఇల్లు శుభ్రం చేసే వారిపైనా, ఈ సమయంలో బయట చెత్త ఊడ్చేవారిపైనా లక్ష్మీదేవి కోపగించుకుంటుంది. చీపురులో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. అందుకే లక్ష్మీదేవి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చి, చెత్తాచెదారాన్ని విసిరివేసే ఇంటి నుండి వెళ్లిపోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఇంటిని ఊడ్చి శుభ్రం చేస్తే, ఖచ్చితంగా ఇంటి బయట చెత్త వేయకండి.
ఉదయాన్నే నిద్ర లేవకుంటే
శాస్త్రాల ప్రకారం, రాత్రిపూట నిద్రపోవడం, సూర్యోదయానికి ముందే మేల్కొనడం ఉత్తమమని భావిస్తారు. అయితే ఈ రోజుల్లో మారిన పరిస్థితుల రీత్యా రాత్రిళ్లు మేల్కొని మధ్యాహ్నం వరకు నిద్రపోతున్నారు. కొంతమంది సోమరితనంతో ఇలా చేస్తుంటారు. ఇలా చేసే వారిపై లక్ష్మీ దేవి కోపగించుకుంటుంది. అలాంటి వారి ఇంట్లో ఆమె ఉండదు.
కోడళ్లను అవమానించే ఇల్లు
స్త్రీలను ఇంటి లక్ష్మి అని అంటారు. కోడళ్లను అవమానించే, హింసించే, కష్టపెట్టే ఇళ్లపై లక్ష్మీదేవి ఎప్పుడూ తన కరుణ, కటాక్షాలు కురిపించదు. ఇవ్వదు. చాలా మంది ఆడవాళ్లు గొడవ పడటమే కాకుండా ఇంటి పెద్దలను తిట్టడం వల్ల ఆమె ఎప్పుడూ అలాంటి ఇళ్లకు దూరంగా ఉంటుంది.
తోమని పాత్రలను పొయ్యిపై ఉంచడం
వంటగదిలో, తోమని పాత్రలను గ్యాస్ స్టవ్‌లపై, పొయ్యిపై ఉంచకూడదు. అలాగే స్టవ్ మీద ఖాళీ పాత్రలు పెట్టకూడదు. అలా ఖాళీ పాత్రలను ఉంచడం వల్ల ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని శాస్త్రాలలో చెప్పారు. అటువంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఎన్నటికీ నిలిచి ఉండదు.
ఈ స్థలంలో చెత్త ఉంచకూడదు
ఇంటి ఉత్తర దిశలో ఎప్పుడూ చెత్తను, దుమ్ము ఉంచకూడదు. శాస్త్రాల ప్రకారం, లక్ష్మీదేవి, కుబేరుడు ఈ దిశలో నివసిస్తారు. ఈ దిశలో వ్యర్థ పదార్థాలను వేయకూడదు. ఉత్తర దిక్కును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి, లేకుంటే లక్ష్మి, కుబేరుడు కోపంతో ఆ ఇంటిని వీడతారు.
మురికి చేతులతో దానిని తాకవద్దు
మురికి లేదా అపరిశుభ్రమైన చేతులతో ఇంట్లోని బీరువాను ఎప్పుడూ తాకవద్దు. అందులో ఇంటి యజమాని కష్టపడి సంపాదించిన ధనాన్ని భద్రపరుస్తారు. అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మురికి చేతులతో బీరువాను ముట్టుకునే వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేస్తుంది. అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండదు.
Also Read : లాకర్ లో ఇవి ఉంచితే డబ్బే డబ్బు, లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.