Vastu Tips For Ganesh Idol : ముక్కోటి దేవుళ్లలో మొదటి పూజ వినాయకుడికే. ఏ పూజ చేసినా, నోము నోచినా, ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా పూజించేది గణేషుడినే. ప్రతి ఇంట్లోనూ వినాయకుడి ప్రతిమ ఉంటుంది. నిత్యం పూజలందుకునే గణపయ్యకు మరింత ప్రత్యేకమైన రోజు వినాయకచవితి.
బాల గణేషుడి జన్మదినమే వినాయక చవితి. ఈ రోజు ఊరూ వాడా పండుగే. చిన్నా పెద్దా అందరకీ సందడే. ప్రతి ఇంట్లోనూ విఘ్నాధిపతి కొలువుతీరుతాడు. మండపాల్లో కూర్చుని తొమ్మిది రోజుల పాటూ పూజలందుకుని ఎంత సందడిగా వచ్చాడో అంతకు మించిన సందడిగా గంగమ్మ ఒడికి తరలివెళతాడు.
మండపాల్లో గణేషుడిని ఏ దిశగా ప్రతిష్టించాలి?
తొమ్మిది రోజుల పాటూ కొలువయ్యే వినాయకుడిని ఇంట్లో అయినా, మండపాల్లో అయినా ఏ దిశలో ఉంచాలి అనే సందేహాలున్నాయి. సాధారణంగా సాధారణంగా మండపంలోని గణేష్ విగ్రహం తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం ఉండేలా ఏర్పాటు చేస్తారు. ఈశాన్య దిశ వాస్తు శాస్త్రంలో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది దైవిక శక్తులకు సంబంధించిన దిశ. విగ్రహం ముఖం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. మండపాల్లో వినాయకుడిని పశ్చిమం, దక్షిణం దిశగా ఏర్పాటు చేయడం మంచిది కాదని చెబుతారు. గణేషుడిని ప్రతిష్టించే స్థలం ఎత్తైన పవిత్ర ప్రదేశంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి.. విగ్రహం వెనుక గోడ ఉండడం మంచిది. మండపాన్ని పూలు, దీపాలు, గంధం, ఇతర పూజా సామగ్రితో అలంకరించడం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. సాధారణంగా వినాయక మండపం అంటే ప్రజలు భారీగా గుమిగూడే ప్రదేశం..అందుకే ఒక్కోసారి దొరికిన ప్రదేశాన్ని బట్టి కూడా మండప ముఖం ఏర్పాటు చేయాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి
దిశ
ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు, విగ్రహం ముఖం ఇంటి లోపలికి ఉండేలా చూసుకోవాలి. అంటే, తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం ఉండేలా ప్రతిష్టించాలి
తొండం
కుడి వైపు తొండం ఉండే విగ్రహం కన్నా ఎడమ వైపు తొండం ఉండే విగ్రహం మంచిదిగా భావిస్తారు
రంగు
తెలుపు లేదా సింధూరం రంగులో ఉండే విగ్రహాలు ఇంటికి శుభం అని వాస్తుశాస్త్రం చెబుతోంది..నలుపు రంగు విగ్రహాలు అస్సలు తెచ్చుకోవద్దు. మట్టి విగ్రహాలను పూజించడం శుభప్రదం
పూజ
వినాయక చవితి రోజున ముందుగా పసుపు గణపయ్యకి పూజలు చేసి..అనంతరం తీసుకొచ్చిన విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా, విగ్రహానికి నూతన వస్త్రం వేసి అలంకారం చేస్తారు.
విగ్రహం అపవిత్రమైన ప్రదేశాలకు దగ్గరగా ఉండకూడదు.
ఈ సూచనలు సాధారణ వాస్తు , సాంప్రదాయ నియమాలపై ఆధారపడి ఉంటాయి. ఇలాగే ఉండాలని లేదు. స్థానిక సంప్రదాయాలు, పండితుల సలహాలను బట్టి కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు. మీరు వినాయకుడిని తీసుకొచ్చి ప్రతిష్టించే ముందు స్థానిక పండితులను ఓసారి సంప్రదించి సలహాలు స్వీకరించండి. మీరు అనుసరించే పద్ధతుల కన్నా మీ భక్తి ముఖ్యం అని గుర్తుంచుకోండి.