శ్రావణమాసం ఆధ్యాత్మికతకు, భక్తికి అత్యంత ప్రత్యేకం. సాధారణంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు..ఈ నెలలో వచ్చే శుక్రవారం మరింత విశిష్టమైనవిగా భావిస్తారు భక్తులు. మొదటి శ్రావణ శుక్రవారం ఇంటికి సిరిసంపదలు, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం తీసుకొచ్చేందుకు అనుకూలమైన రోజు. వరలక్ష్మీవ్రతం పూర్తిస్థాయిలో చేయలేనివారు ఈ రోజు కూడా సాధారణ లక్ష్మీపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించవచ్చు. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే బాహ్య పూజతో పాటూ మనస్సు శుద్ధి, భక్తి, కృతజ్ఞత భావం ముఖ్యం. శ్రీ మహాలక్ష్మి ధనాన్ని మాత్రమే కాదు..ధైర్యం, శాంతి, కుటుంబ ఐక్యతను కూడా ప్రసాదిస్తుంది. పూజకోసం ముందుగా సన్నాహాలు చేసుకోండి.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించండి. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేయండి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించండి. ఇది శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించేందుకు సంకేతం.
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
పూజా సామగ్రి సిద్ధం చేసుకోండి
దీపం కుందులు, వత్తులు, నూనె, పసుపు, కుంకుమ, గంధం, అగరుబత్తి, కర్పూరం, ఆవు నెయ్యి, అక్షింతలు, తాజా పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు, వక్కలు, కలశం, కొత్త వస్త్రం, నాణేలు, పాయసం, చక్కెర పొంగలి లేదా పరమాన్నం వంటి నైవేద్యాలు సిద్ధం చేసుకోండి.
పూజా విధానం ఇలా సులువుగా...
ముందుగా పూజా స్థలంలో పీఠం ఏర్పాటు చేసి దానిపై లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచండి. కలశ స్థాపన చేయండి. కలశంలో శుభ్రమైన నీరు, పసుపు , కుంకుమ, బియ్యం , నాణేలు వేసి మామిడి ఆకులు, పసుపు రాసిన కొబ్బరికాయ ఉంచండి. దానిపై వస్త్రాన్ని అలంకరించండి. ముందుగా వినాయక ప్రార్థన చేసి...అనంతరం అమ్మవారిని ఆవాహనం చేయండి. పసుపు, కుంకుమ, గంధం, పూలతో అలంకరించి షోడసోపచార పూజ లేదా పంచోపచార పూజ చేయండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి జపించండి..అనంతరం నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి.
పూజ తర్వాత ముత్తైదువులకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం , వస్త్రాలు వాయనంగా ఇవ్వండి. ఉపవాసం పాటించేవారు నైవేద్యం స్వీకరించిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు.
ఏ పూజలో అయినా బాహ్య ఆచారాలు కాదు..హృదయ శుద్ధి, నిష్కామ భక్తి ముఖ్యం. శ్రీ మహాలక్ష్మి పూజలో భాగంగా సంపదతో పాటూ సద్గుణాలు, సహనం, దయ కలగాలని కోరుకోండి.
శ్రావణ శుక్రవారం పూజ ద్వారా ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుంది. వైవాహిక జీవితంలో కష్టాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు, భక్తుల విశ్వాసం కూడా. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి పూజ చేయండి..అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై మీ కుటుంబ సభ్యులపై ఉండాలని ప్రార్థించండి.
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు
