AP Municipal Elections 2026: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో కీలక అంకానికి తెరలేచింది. రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రకటనతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, జనసేన, వైసీపీ, బీజేపీ అప్పుడే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 

Continues below advertisement

రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం.401/SEC-F1/2026-1ను విడుదల చేస్తూ, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియకు ప్రాథమిక అడుగు వేసింది. ఈ నోటిఫికేషన్ ప్రధాన ఉద్దేశ్యం పట్టణ ప్రాంతాల్లో పారదర్శకమైన, తప్పుల్లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం. రాజ్యాంగబద్ధంగా గడువు ముగియనున్న లేదా ఖాళీగా ఉన్న మేయర్‌, డిప్యూటీ మేయర్, వార్డు కార్పొరేటర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఈ కసరత్తు సాగుతోంది. 

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం 3 సెప్టెంబర్‌ 2026 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురించనున్నారు. 

Continues below advertisement

ఈ జాబితా తయారీకి 1 జనవరి 2026ను ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే తేదీ నాటికి 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు. భారత ఎన్నికల సంఘం ఇటీవల అసెంబ్లీ నియోజకవర్గాల కోసం రూపొందించిన తాజా ఓటర్ల డేటాను ప్రాతిపదికగా తీసుకొని, దానిని మున్సిపల్ వార్డుల వారీగా విభజిస్తారు. 

ఎలా నిర్వహిస్తారు?

ఓటర్ల జాబితాల తయారీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని కార్పొరేషన్లలో వార్డుల వారీ జాబితాలను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పోలింగ్ స్టేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవడం వీరి ప్రధాన బాధ్యత. 

రాష్ట్రంలోనే అతి పెద్దదైన గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్ కోసం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. విశాఖ నగర విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకొని, జోనల్‌ కమిషనర్లకు తమ పరిధిలోని వార్డుల జాబితాలను ప్రచురించే అధికారాలను కల్పించారు. దీని వల్ల పరిపాలనా సౌలభ్యం పెరగడమే కాకుండా, ఓటర్లకు ఫిర్యాదు చేసే ఛాన్స్ ఈజీ అవుతుంది. 

ఎందుకు ఈ జాబితా అత్యంత కీలకం?

సెప్టెంబర్‌ 3న విడుదలయ్యే జాబితా కేవలం ఓటర్ల పేర్ల కోసం మాత్రమే కాదు, అది ఎన్నికల రిజర్వేషన్ల దిశను నిర్ణయిస్తుంది. 

వార్డుల వారీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల లెక్కల ఆధారంగానే ప్రభుత్వం రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్లను ప్రకటిస్తుంది. మేయర్ పీఠం ఏ వర్గానికి దక్కుతుంది, ఏ వర్గం పోటీ చేయాలి, అన్నది ఈ డేటాపైనే ఆధారపడి ఉంటుంది. రిజర్వేషన్లు ఖరారు అయితే తప్ప రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండదు. అందుకే అటువంటి ఆశావాహులు, ఇటు పార్టీ అధిష్ఠానాలు ఈ జాబితా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. 

ఓటర్లకు సూచనలు 

గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఓటర్ల పేర్లు గందరగోళానికి గురి కాకుండా ఉండటానికి ఈ సారి టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలోని డేటాను నేరుగా మున్సిపల్ వార్డుల మ్యాపింగ్‌కు అనుసంధానించం వల్ల డూప్లికేట్ ఓట్లకు అడ్డుకట్ట పడనుంది. 

సెప్టెంబర్‌ 3న జాబితా విడుదలైన వెంటనే ప్రతి ఒక్కరూ తమ వార్డు పరిధిలోని మున్సిప్ కార్యాలయంలో లేదా అధికారిక SEC వెబ్‌సైట్‌లో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలి. అసెంబ్లీ జాబితాలో పేరు ఉన్నప్పటికీ స్థానిక మ్యాపింగ్‌లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత కమిషనర్, జోనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి సవరించుకోవాలి.