Navratri 2025: ఆంధ్రప్రదేశ్ లో శరన్నవరాత్రి..తెలంగాణలో బతుకమ్మ...రెండు రాష్ట్రాల్లోనూ శక్తిస్వరూపిణిని పూజిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ విజయదశమితో ఉత్సవాలు ముగుస్తాయి. అయితే బతుకమ్మ పండుగ ఆశ్వయుజమాసం ప్రారంభానికి ముందురోజు వచ్చే భాద్రపద అమావాస్య రోజు ప్రారంభమవుతుంది... దసరా వేడుకలు ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి మొదలవుతాయి. దుర్గాష్టమి రోజు వచ్చే సద్దులబతుకమ్మతో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. ఆ మర్నాడు వచ్చే మహర్నవమితో శరన్నవరాత్రి పూర్తై... విజయదశమిని వైభవంగా నిర్వహిస్తారు.
తెలంగాణలో పూలపండుగ చేస్తే..ఆంధ్రప్రదేశ్ లో బొమ్మలకొలువులు, ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యాయి.. అక్టోబర్ విజయదశమితో ముగుస్తాయి. ఈ సందర్భంగా ప్రముఖ దేవాలయాలు, కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.
కనక దుర్గా ఆలయం, విజయవాడ (ఇంద్రకీలాద్రి)
ఇక్కడ 9 రోజులు దుర్గమ్మను 9 అలంకారాల్లో కొలువుతీర్చుతారు. ప్రతి రోజు సాయంత్రం లక్ష్మీ పుష్పకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. విజయదశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరిస్తారు. మూల నక్షత్రంరోజు ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఇంద్రకీలాద్రి చేరుకుంటారు. దసరా సమయంలో ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల సందడి ఉంటుంది. తెలుగురాష్ట్రాలకు చెందిన శక్తి స్వరూపిణి భక్తులు తప్పనిసరిగా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మను దర్శించుకోవాలనుకుంటారు. భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్ , హైదరాబాద్
చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలోనూ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ అమ్మవారి పేరుమీదుగా భాగ్యనగరం అని పిలుస్తారు. నిత్యం భక్తులతో కళకళలాడే పర్యాటక ప్రదేశం అయిన చార్మినార్ ను సందర్శించేవారంతా భాగ్యలక్ష్మి అణ్మవారిని దర్శించుకుంటారు.
మహాశక్తి ఆలయం, కరీంనగర్
కరీంనగర్ లో ఉన్న మహాశక్తి ఆలయంల శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. రుద్రచండీ హోమాలు, దేవీపూజలు నిర్వహిస్తారు. పంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన ఈ ఆలయం దసరా టైమ్‌లో మరింత సందడిగా ఉంటుంది. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ రాత్రి 9గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దాండియా నిర్వహిస్తారు. భక్తుల ఆటపాటలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. కేవలం స్థానికులు మాత్రమే కాదు కరీంనగర్ జిల్లా చుట్టుపక్కలవారు కూడా ఇక్కడికి వస్తుంటారు. విజయవనాడ కనకదుర్గ లానే ఇక్కడ అమ్మవారి దీక్షతీసుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది
భద్రకాళీ ఆలయం, వరంగల్
దేవీ నవరాత్రులు, బతుకమ్మ సందర్భంగా వరంగల్ భద్రకాళీ దర్శనార్థం భక్తులు బారులు తీరుతారు. రోజుకో అలంకారంలో భద్రకాళి భక్తులను అనుగ్రహిస్తుంది. నిత్యం భక్తులతో కళకళలాడే భద్రకాళి ఆలయం..దసరా సందర్భంగా మరింత రద్దీగా ఉంటుంది
సీతారామచంద్ర స్వామి ఆలయం, భద్రాచలం తెలుగు రాష్ట్రాల భక్తులు దర్శించుకోవాల్సిన ప్రముఖ ఆలయాల్లో భద్రాచలం ఒకటి. శ్రీరాముడు రావణుడిని జయించిన సందర్భంగా ఈ సమయంలో పలుచోట్ల రావణదహనం నిర్వహిస్తారు.శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం, గోదావరి ఒడ్డున ఘటాల ప్రదర్శన, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ
మహాలయ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ దుర్గాష్టమితో ముగుస్తుంది. ఈసందర్భంగా స్థానికంగా ఉండే అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక హుస్సేన్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో బతుకమ్మల నిమజ్జనాల సందడిసాగుతుంది
బొమ్మల కొలువులు
సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం కొందరికి ఉంటే..దసరా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు.
ఇక రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో గర్బా-దాండియా నృత్యాల సందడే సందడి..