గ్రహ స్థితిగతుల ప్రభావాలు కేవలం మనుషుల మీద మాత్రమే కాదు.. భూమి మీద ఉన్న సమస్త ప్రాణ కోటి మీదా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఏప్రిల్ 9న ఏర్పడబోయే సూర్య గ్రహణ ప్రభావం ఏఏ పశుపక్ష్యాదుల మీద ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.


గ్రహణాలు ఎప్పుడూ శుభసూచకాలు కాదు. అందునా సూర్య గ్రహణం మరింత అశుభం. ఈ గ్రహణాల ప్రభావం కేవలం మానవ జాతి మీద మాత్రమే కాదు సమస్త ప్రాణి కోటి మీద ఉంటుంది. గ్రహణ ప్రభావాన్ని సునిశితంగా గమనిస్తే అన్ని ప్రాణుల మీద ఎలా ఉందో గుర్తించడం సాధ్యమే.


సూర్యగ్రహణ సమయంలో చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్యగా సంచరిస్తాడు. అందువల్ల సూర్యుడు పూర్తిగా లేదా పార్శ్వంగా కొంత సమయం పాటు కనిపించడు. చంద్రుడు సూర్యుడికి పూర్తి స్థాయిలో అడ్డు వస్తూ ఉంటే అది సంపూర్ణ సూర్యగ్రహణంగా చెప్పవచ్చు. ఈసమయంలో చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖ మీద ఉంటారు. జ్యోతిషం గ్రహణాన్ని అశుభంగా భావిస్తుంది. ఎందుకంటే సూర్యుడే సమస్త భూమండలానికి శక్తి ప్రదాత. ఆ శక్తి ప్రవాహం నిరంతరాయంగా సాగుతూ ఉంటేనే భూమి మీది ప్రాణికోటి ఆరోగ్యంగా మనుగడ సాగించగలదు. కొన్ని గంటలే అయినా గ్రహణ కాలపు ఎడబాటు పరిణామాలు కచ్చితంగా భూమి మీద ఊపిరి తీసుకుంటున్న ప్రతి ప్రాణి మీద ఉంటుంది.


గ్రహణ పరిణామాలు మనుషులతోపాటు పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాలు, వృక్షాల మీద కూడా కనిపిస్తాయి. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో గ్రహణ ప్రభావ ప్రాంతాల్లో పూర్తిగా చీకటి ఆవహిస్తుంది. ఉష్ణోగ్రతలు కూడా పడిపోతాయి. ఈ సందర్భంలో జీవ కోటి విచిత్రంగా ప్రవర్తిస్తుంది. పగటి పూట అకస్మాత్తుగా చీకటి పడి రాత్రిని తలపిస్తుంది. పక్షులు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవ్వుతాయి. భయంతో గూళ్లు చేరి కోలాహలం  చేస్తాయి. పశువుల్లో కూడా అదే విధమైన అయోమయం ఆవరిస్తుంది.


మొక్కలు, వృక్షాలు వాటికి కావల్సిన శక్తిని పొందడానికి వాటికి సూర్య రశ్మి చాలా అవసరం. సూర్యరశ్మిని ఉపయోగించుకుని మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఈ క్రియ ద్వారానే మొక్కల ఎదుగుదలకు అవసరమయ్యే శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సంపూర్ణ సూరర్య గ్రహణ సమయంలో సూర్యుడు కనిపించకపోవడం వల్ల కిరణ జన్య సంయోగ క్రియ పూర్తిగా ఆగిపోతుంది. అందువల్ల మొక్కలు, వృక్షాల్లోను చిన్నపాటి మార్పును గమనించవచ్చు. సూర్యుడు తిరిగి కనిపించి కిరణజన్య సంయోగ క్రియ మొదలవడానికి కొంత సమయం పడుతుంది. కనుక ఒక రకంగా నిస్తేజం అవుతాయి. ఈ మార్పు తాత్కాలికమే. కానీ తిరిగి శక్తి పొందేందుకు కొంత సమయం పడుతుంది.


Also Read : వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే అదృష్టం తెస్తుందా?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.