Dhanteras Yama deepam 2022:  ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవం ధన్వంతరి. ధనత్రయోదశితోనే  దీపావళి పండుగ మెుదలవుతుంది. అయితే ఈ పండుగ రోజు 'యమదీపం' వెలిగిస్తారు. ఇలా చేస్తే ఈ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, అపమృత్యు దోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు. దీనికి సంబంధించి ఓ పురాణ కథ చెబుతారు...


యముడికి ప్రత్యేక పూజ
పూర్వం ‘హిమ’ అనే రాజుకు... లేక లేక కొడుకు పుడతాడు. వివాహమైన నాలుగో రోజునే ఆ రాకుమారుడు మరణిస్తాడని పండితులు చెబుతారు. కాలక్రమంలో ఒక రాజకుమారి అతడిని వరించి పెళ్లిచేసుకుంటుంది. ఆ రాకుమారిని కూడా హెచ్చరిస్తారు.. పెళ్లైన వెంటనే వైధవ్యం తప్పదంటారు. అయితే తన భర్తని తానే కాపాడుకుంటానని ధీమాగా చెబుతుందామె. పెళ్లైన నాలుగో రోజు రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోసి దీపాలు వెలిగిస్తుంది. లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో స్తుతిస్తూ, గానం చేస్తుంటుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు. నగల మీద పడిన దీపకాంతి వల్ల ఆయన కళ్లు చెదురుతాయి. యువరాణి పాటలకు మైమరచిపోతాడు. అప్పటికే మృత్యు ఘడియలు దాటిపోవడంతో యముడు శూన్య హస్తాలతో వెనుతిరిగి వెళ్లిపోయాడని చెబుతారు. అప్పటి నుంచీ ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం...ఇంటి గుమ్మ బయట దీపాలు వెలిగించడం చేస్తుంటారని చెబుతారు. 


Also Read: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!


మృత్యుదోషం తొలగి పోయేందుకు, పరిపూర్ణ ఆయుష్షు కోసం ధనత్రయోదశి రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో కానీ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో కానీ నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వెలిగించి దీపారాధన చేస్తారు. యముడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు కాబట్టి..ఇంటి ఆవరణంలో దక్షిణం వైపు ధాన్యపు రాశి మీద ఈ దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం వెలిగించడం వల్ల యముడు శాంతిస్తాడని అకాల మరణం దరి చేరనీయడమని విశ్వసిస్తారు.


యమదీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం
 'మృత్యునాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సః
త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మామ్'


Also Read:  దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, బాణసంచా ఎందుకు కాలుస్తారు!


దీపం వెలిగించడం వెనుకున్న పరమార్థం


“సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
 గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
 భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
 త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
'మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను'. అని అర్థం