తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు జరిగే ప్రాంతాల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉండే కోటప్పకొండ ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. అక్కడి సమీప గ్రామాల ప్రజలు కొండకు పెద్ద ఎత్తున ప్రభలు కట్టుకుని వెళ్తారు. ఏటికేడు ప్రభలను కొత్తగా తయారు చేస్తూంటారు. ఇటీవలికాలంలో విద్యుత్ ప్రభలను ఎక్కువగా సిద్ధం చేస్తున్నారు.  డెబ్భై అడుగుల ఎత్తుతో నిర్మాణం చేసి విద్యుత్ బల్బులు అమర్చి ప్రభలను కొండ తరలిస్తున్నారు. కోటప్పకొండ ప్రభలకు ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 


 






గ్రామాలు పచ్చని పాడిపంటలతో ఉండాలంటే  కోటయ్య కొండకు ప్రభ కట్టుకొని వెళ్ళాలని ఇక్కడ ప్రజలు భావిస్తారు.   కోరిన కోర్కే తీర్చితే ప్రభ కట్టుకొని కొండకు వస్తామని మ్రొక్కుకుంటారు. గత డెభ్భె ఏళ్ళ నుండి క్రమం తప్పకుండా కొన్ని గ్రామాలు ప్రభలను కొండకు తరలిస్తున్నాయి‌. ప్రభల విషయంలో గ్రామాల మధ్య పోటీ కూడా ఉంటుంది. గ్రామాలతో పాటు ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు ప్రభలు తయారు చేసుకుంటాయి.  ఒకే ఇంటి పేరు గల కుటుంబాలు ప్రత్యేకంగా కొండకు ప్రభలతో వస్తాయి‌. ఇంటి కింత లేకపోతే ఎకరాని కింత అని చందా వేసుకొని ప్రభను నిర్మిస్తారు. ఒక్కో ప్రభను తరలించడానికి వంద మందికిపైగానే అవసరం అవుతారు. ఒకప్పుడు ఎద్దులతో నే ప్రభలను తరలించే ప్రజలు ప్రస్తుతం ట్రాక్టర్ల సాయంతో ప్రభలను కొండకు తరలిస్తున్నారు. 


 






ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో నెల ముందు నుంచే పనులు ప్రారంభించారు. ప్రభకు సంబంధించిన ఇరుసులు, రాతిచక్రాలు, డొలుపులు, కమ్ములు ముందుగా సిద్ధం చేసుకుంటారు. వీటిని బిగించిన అనంతరం క్రేన్‌ సాయంతో ఏర్పాటు చేసిన రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కొండకు తరలించేందుకు సిద్ధం చేస్తారు. ప్రభ కొండకు బయలుదేరే ముందు గ్రామంలో, కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు, తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత మరోసారి పండగ వాతావరణంలో ప్రభ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమాల్లో ఊరివారు ఎక్కడ ఉన్నా గ్రామానికి చేరుకుంటారు. ఐకమత్యంతో ఊరంతా హరహర చేదుకో కోటయ్య అంటూ ప్రభతో నడుస్తూ కోటప్పకొండకు చేరుకుంటారు. ఈ ఏడాది అదే ఉత్సాహం కనిపిస్తోంది. 


 


ఖర్చులకు వెనుకాడకుండా ప్రభలను తయారు చేసి వాటిని కోటయ్య సన్నిధికి తరలిస్తూ ఉంటారు. ప్రభలను తరలిస్తూ చేసే శివరాత్రి జాగారానికి ప్రత్యేకత ఉంటుంది.  ఈ ప్రభలపై ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ భక్తులు జాగారం పూర్తి చేస్తారు. కోటప్పకొండ తిరుణాళ్ళ ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.