Dress Code Implementation In Yadadri Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి (Yadadri Narasimha Temple) ఆలయంలో ఇకపై డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. ఈ మేరకు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని.. జూన్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఆలయ పునఃనిర్మాణం తర్వాత నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక రోజుల్లో రద్దీ అధికంగా ఉంటోంది. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా ఈ నిబంధన తీసుకొస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. నిత్య కల్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని అన్నారు.
వారికి మినహాయింపు
తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదాద్రిలో వీఐపీ బ్రేక్ దర్శనానికి భక్తులు డ్రెస్ కోడ్ పాటించాలని చెప్పారు. అలాగే, స్వామి వారి సాధారణ ధర్మ దర్శనం క్యూలైన్ లో వచ్చే భక్తులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. జూన్ 1 నుంచి డ్రెస్ కోడ్ కచ్చితంగా అమలు చేస్తామని.. భక్తులు సహకరించాలని కోరారు. అటు, ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీశుని మహత్యం తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బోర్డులోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫోన్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో క్షేత్ర మహత్య వివరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ప్లాస్టిక్ నిషేదం
మరోవైపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానంలో పలు శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ యేతర వస్తువులను మాత్రమే వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని ఆదేశించారు.
నారసింహుని జయంతి ఉత్సవాలు
యాదాద్రి ఆలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు లక్ష్మీ నరసింహుని జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టతో పాటు అనుబంధ ఆలయాలైన పాతగుట్ట, దబ్బకుంటపల్లిలో కూడా వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న సోమవారం ఉదయం స్వస్తివచనం, పుణ్యాహవచనం, లక్ష కుంకుమార్చన పూజలతో పాటు తిరువేంకటపతి అలంకార సేవోత్సవం కూడా నిర్వహించనున్నారు. సాయంత్రం అంకురార్పణం, హవనం, గరుడ వాహనం, వివిధ అలంకార సేవలు నిర్వహిస్తారు. ఈ నెల 21న ఉదయం నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్దన అలంకార సేవోత్సవం ఉంటాయని అధికారులు తెలిపారు. పాతగుట్ట ఆలయం యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. అటు, దబ్బకుంటపల్లి నరసింహ ఆలయంలో ఈ నెల 22న ఉదయం 11 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, అభిషేకం, స్వామి వారి కల్యాణం, మహా నివేదన ఉంటాయని అన్నారు.
భక్తుల రద్దీ
మరోవైపు, ఆదివారం సెలవు కావడంతో యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.