Char Dham Yatra: ప‌ర‌మ శివుని పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్‌ (Kedarnath) ఒకటి. అలాగే చార్‌ ధామ్‌ యాత్రలో ఇది కూడా భాగం. ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని మ‌హాదేవుడిని దర్శించుకొంటారు. అయితే, హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం అంత సులువు కాదు. ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌ వరకు మాత్రమే వాహనాలపై వెళ్లేందుకు వీలుంటుంది. అక్కడి నుంచి మరో 18 కి.మీ యాత్ర అతికష్టంగా ఉంటుంది. ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం ఈ నెల 25వ తేదీన తెరుచుకోనున్నాయి.


దేశంలోనే చార్ ధామ్ యాత్ర‌ను అత్యంత ముఖ్య‌మైన ఆధ్యాత్మిక యాత్ర‌ల‌లో ఒక‌టిగా భ‌క్తులు భావిస్తారు. చార్ ధామ్ అంటే నాలుగు పుణ్య‌క్షేత్రాలు. అవి కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి. కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఈ నెల 25వ తేదీన తెరుస్తున్న‌ట్టు అధికారులు బుధవారం తెలిపారు. 


కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి అనేక మంది వృద్ధులు, చిన్న పిల్లలు, ఆరోగ్యం సహకరించనివారు కూడా వస్తుంటారు. అందుకే అలాంటి వారి కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం హెలికాప్టర్‌ సర్వీసులను ప్రారంభించింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది దీన్ని వినియోగించుకుంటున్నారు. కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకుంటున్నవారు భారతీయ రైల్వేకు చెందిన టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఐఆర్‌సీటీసీ (IRCTC) నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. దీనికోసం ఐఆర్‌సీటీసీ హెలియాత్ర పేరిట ప్రత్యేక పోర్టల్‌ను (https://heliyatra.irctc.co.in) ప్రారంభించింది. 


చార్‌ధామ్ యాత్రకు, మొత్తం 6.34 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ మార్చిలో తెలిపింది. "ఇప్పటి వరకు, 6.34 లక్షల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో కేదార్‌నాథ్‌కు 2.41 లక్షలు, బద్రీనాథ్‌కు 2.01 లక్షలు, యమునోత్రికి 95,107మంది, గంగోత్రి యాత్ర‌కు 96,449 మంది భక్తులు నమోదు చేసుకున్నారు" అని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ తెలిపింది.


కేదార్‌నాథ్‌ ఆలయం నుంచి 25 కి.మీ నుంచి 200 కి.మీ వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న హెలిప్యాడ్‌ల నుంచి హెలికాప్టర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది డెహ్రాడూన్‌ నుంచి కూడా హెలికాప్ట‌ర్ల‌ను నడిపారు. సర్సీ అనే హెలిప్యాడ్‌ ఆలయం నుంచి కేవలం 23 కి.మీ దూరంలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి 12 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అలాగే ఫటా, గుప్తకాశీ, సీతాపూర్‌, అగస్తముని ప్రాంతాల నుంచి గత ఏడాది హెలికాప్టర్లు నడిచాయి. హెలికాప్టర్‌ ద్వారా ఆలయానికి చేరుకునే వారు కొన్ని ప్రత్యేక ఛార్జీలు చెల్లిస్తే దర్శనంలో కూడా ప్రాధాన్యం ఉంటుంది. హెలికాప్టర్‌ ద్వారా ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆ పరమశివుని దర్శనంతో పాటు హిమాలయాల అందాలను వీక్షించే అవకాశం కూడా దక్కుతుంది.


ఈ నెల 22వ తేదీన యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. 25న కేదార్‌నాథ్, 27న బద్రీనాథ్ ఆల‌యాలు తెరుచుకోనున్నాయి. 25వ తేదీన‌ ఓంకారేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటలకు మహాభిషేక పూజతో పాటు సంప్రదాయంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత 6:30 గంటలకు కేదార్‌నాథ్‌లోని ఆలయ మహాద్వారాన్ని తెరవనున్నారు.  అదే రోజు ఉదయం 8:30 గంటలకు కేదార్ నాథుడికి హారతి ఇవ్వనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 27న ఉదయం 7:10 గంటలకు బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు. నవంబర్ 19వ తేదీన బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేయడంతో చార్ ధామ్ యాత్ర ముగియనుంది.


కాగా.. చార్‌ధామ్ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం హెల్త్ ఏటీఎం ఏర్పాటు చేస్తామని, దీని వ‌ల్ల భక్తులకు మ‌రిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వ‌స్తాయని, చార్ ధామ్ యాత్రలో వైద్య సౌకర్యాల పటిష్టతకు ఇది  ముందడుగు అని ముఖ్యమంత్రి పుష్క‌ర్ సింగ్ ధామి తెలిపారు.


ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్రకు గ‌త నెల‌11వ తేదీన రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. స‌ముద్ర మ‌ట్టానికి చాలా ఎత్తైన ప్రదేశాలలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాలు ప్రతి సంవత్సరం దాదాపు ఆరు నెలల పాటు మూసివేయబడతాయి. వేసవిలో (ఏప్రిల్ లేదా మే)లో ఈ ఆల‌యాల త‌లుపులు తెరుచుకుంటాయి. శీతాకాలం (అక్టోబర్ లేదా నవంబర్) ప్రారంభంలో మూసివేస్తారు.


Also Read: బాబోయ్! ప్రేమ కోసం రాజశేఖర్‌ను జీవిత బ్రిడ్జి మీది నుంచి తోసేసిందా?