Chanakya niti in telugu: చాణక్యుడి పేరు చెప్పేసరికి గొప్ప రాజకీయ గ్రంథం అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అంతేకాదు… తన అపారమైన రాజనీతితో వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి… మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావి చాణక్యుడు. నంద వంశ నిర్మూలను మౌర్యవంశ స్థాపనకు కారకుడైన కౌటిల్యుడు కేవలం అర్థశాస్త్రం, రాజనీతిజ్ఞత మాత్రమే కాదు. సుఖమయ జీవితానికి పాటించాల్సిన చాలా నియమాలను చెప్పాడు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవిత పురోగమనానికి సంబంధించిన అనేక అంశాలను వెల్లడించాడు. కష్ట సమయాల్లో మనకు మద్దతు ఇచ్చే నిజమైన స్నేహితుడు డబ్బు. ఇది కష్టమైన జీవనశైలిని ఆహ్లాదకరంగా, సులభంగా మారుస్తుంది. ధనికుడు డబ్బు ఉన్నంత వరకు సమాజంలో గౌరవం పొందుతాడు. కానీ తన దగ్గర డబ్బున్నప్పుడు దాన్ని తన డాబు కోసం వాడుకునేవాడికి ఎప్పటికీ గౌరవం దక్కదు. మన భవిష్యత్తు గురించి చాణక్య నీతిలో అనేక విషయాలు వెల్లడించాడు.
1. విద్య
మంచి చదువు మనిషి వ్యక్తిత్వాన్ని కూడా పెంచుతుంది. మరోవైపు, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోని లేదా దానికి ప్రాముఖ్యత ఇవ్వని వ్యక్తి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. విద్య ఒక వ్యక్తికి మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని బోధిస్తుంది. విజయం సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
2. ఉపాధ్యాయుడు
చాణక్య నీతి ప్రకారం, విద్యార్థి తన గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించకూడదు. ఉపాధ్యాయులు - విద్యార్థుల మధ్య సంబంధం చాలా స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. అటువంటి పరిస్థితిలో, మీరు వారిని అవమానిస్తే, జ్ఞాన దేవత అయిన సరస్వతి మాత మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఫలితంగా విద్య ద్వారా సంక్రమించే జ్ఞాన సంపద మీరు కోల్పోతారు.
3. జ్ఞానం
జ్ఞానం, విద్య లేకుండా జీవితంలో ఏ వ్యక్తీ విజయం సాధించలేడు. కాబట్టి ప్రతి వ్యక్తి జ్ఞానం పొందాలి. విద్య అనేది జీవితంలో అత్యంత విలువైనది. ఎందుకంటే అది మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది. మీకు చదువు లేకపోయినా, జ్ఞానం ఉంటే డబ్బు సంపాదించడం ఏ మాత్రం కష్టం కాదు.
4. సంపూర్ణ జ్ఞానం
చాణక్య నీతి ప్రకారం, విద్యార్థి తన గురువు నుంచి జ్ఞానాన్ని పొందేందుకు ఎప్పుడూ వెనుకాడడు. పిరికితనం, సంకోచం ఉన్నవారు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేరు. అలాంటి వారు జీవితంలో విజయం సాధించడం కష్టం. అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమేనని అనుభవజ్ఞులు చెబుతుంటారు. అందుకే ఏ అంశమైనా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి.
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, పైన పేర్కొన్న 4 శక్తులను కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓటమి పాలవడు. అతను ప్రారంభించిన ప్రతి పనీ విజయవంతమవుతుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదని గమనించగలరు.