Bhogi Mantalu 2023: సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి. తెల్లవారు జామునే చలిగాలుల మధ్య భోగిమంటలు వేసుకుని వెచ్చగా పండుగకు స్వాగతం పలుకుతారు. భోగిమంటలు అంటే చాలామంది ఇంట్లో ఉన్న చెత్తా చెదారం వేసి తగులబెట్టడమే అనుకుంటారు. ఏం వేయాలి ఏం వేయకూడదో తెలుసుకోండి. 


సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోవాలంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి..ఈ సమయంలో భోగిమంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో పొలాల నుంచి వచ్చే పురుగులను తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనక మరో విశేషం ఏంటంటే  సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పులు తట్టుకునేందుకు శరీరాన్ని సిద్ధం చేయడం అన్నమాట.


Also Read: భోగ భాగ్యాలు కలిగించే భోగి రోజు ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది


అగ్ని ఆరాధన



  • భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించే ఓ సందర్భం. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా వెలిగించాలి.సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తే భోగి మంట వెలిగించాలి...అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది .

  • ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగిమంటలో వాడేవారు.  ఇవి బాగా మండేందుకు ఆవు నెయ్యి వేసేవారు. పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

  • పిడకలు, చెట్టు బెరడు ఉపయోగించలేని వారు కనీసం తాటి, కొబ్బరి ఆకులు , ఎండిన కొమ్మలతో భోగిమంట వేసేవారు. కానీ  కాలం మారింది భోగిమంట కూడా ఫ్యాషన్ గా మారిపోయింది. ఇంట్లో ఉన్న చెత్తా చెదారం, రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలను కూడా భోగిమంటల్లో వేస్తున్నారు.

  • ప్లాస్టిక్ సామాన్లు మంటల్లో వేయడమే సరికాదంటే..అవి సరిగా మండడం లేదని పెట్రోల్, కిరోసిన్ పోస్తునారు... దీంతో భోగిమంటల వెచ్చదనం, సంక్రాంతి సందడి మాటేమో కానీ అనారోగ్యం రావడం ఖాయం. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్,  కిరోసిన్  నుంచి వెలువడే పొగతో  పర్యావరణం కలుషితమవుతోంది.

  • అందుకే...పిడకలు, చెట్టు బెరడు, కలప లాంటివి వేసుకుని భోగిమంట వేయకపోయినా పర్వాలేదు కానీ... ప్లాస్టిక్, చెత్తా-చెదారంతో భోగిమంట వేసి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పాడుచేయొద్దంటున్నారు పండితులు, ఆరోగ్య -పర్యావరణ నిపుణులు.


Also Read: భోగి రోజు మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి


2023లో జనవరి 14 శనివారం భోగి
జనవరి 15 ఆదివారం సంక్రాంతి
జనవరి 16 సోమవారం కనుమ
జనవరి 17 మంగళవారం ముక్కనుమ