Bhaum Pradosh Vrat 2025: శ్రావణమాసం శ్రీ మహాలక్ష్మికి మాత్రమే కాదు పరమేశ్వరుడికి కూడా ప్రియమైన మాసం. శ్రావణానికి ముందు మహాదేవునిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఆషాఢ మాసంలో  శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి. ఈ రోజు మంగళవారం కూడా కావడంతో భౌమ ప్రదోష వ్రతం ఆచరిస్తారు. శివుడి అనుగ్రహం పొందేందుకు భక్తులంతా ఈ వ్రతాన్ని కచ్చితంగా ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా భక్తుల కష్టాలన్నీ తొలగిపోయి వారు కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. ప్రదోషం - మంగళవారం అత్యద్భుతమైన కలయికగా చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. భౌమ ప్రదోష వ్రతం ఎందుకు చేస్తారు?

భౌమ ప్రదోషాన్ని మంగళ ప్రదోష వ్రతం అని కూడా అంటారు

భౌమ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది

భూమి, భవనాలకు సంబంధించిన వివాదాల్లో చిక్కుకుని ఉంటే వాటి నుంచి బయటపడతారు

దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యవంతులుగా ఉంటారు, శారీరక బలం పెరుగుతుంది

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి కూడా భౌమ ప్రదోష వ్రతం ఆచరిస్తారు

మంగళ గ్రహానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ లభిచేందుకు ఈ వ్రతం సహాయపడుతుంది.

శివుడు , మంగళ దేవుని అనుగ్రహంతో ఈ వ్రతం చేసేవారు  ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్భయత్వం పొందుతారు భౌమ ప్రదోష వ్రతం ఎప్పుడొచ్చింది?

భౌమ ప్రదోష వ్రతం  ఈ ఏడాది (2025) జూలై 8 మంగళవారం వచ్చింది. ఈ రోజున ప్రదోష కాలంలో శివ పూజకు ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో శివుడు కైలాసంలో ఆనందతాండవం చేస్తాడని..ఈ సమయంలో ఎవరైనా ఆయన్ను ఆరాధిస్తారో వారి కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు.

ఆషాఢ శుక్ల త్రయోదశి తిథి ప్రారంభం - 2025 జూలై 7 సోమవారం రాత్రి 10.14

ఆషాఢ శుక్ల త్రయోదశి తిథి ముగింపు - 2025 జూలై 8 మంగళవారం రాత్రి 11.53

భౌమ ప్రదోష పూజా ముహూర్తం - జూలై 08 మంగళవారం సాయంత్రం 07:23 - రాత్రి 09:24 వరకు

భౌమ ప్రదోష వ్రతం పూజా విధానం

భౌమ ప్రదోష వ్రతం ఆచరించాలి అనుకుంటే ఆ రోజు వేకువజామునే నిద్రలేవాలి. స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. శివ లింగానికి నీటిని సమర్పించి అభిషేకం చేయాలి. అవకాశం ఉంటే శివాలయానికి వెళ్లి దర్శించుకుని రావాలి. రోజంతా ఉపవాసం ఆచరించాలి. అనారోగ్యంతో ఉండేవారు పండ్లు తీసుకోవచ్చు.  సాయంత్రం  ప్రదోష కాలంలో మరోసారి పూజ చేసి ఆలయానికి వెళ్లాలి. అభిషేక ప్రియుడైన శివయ్యను పంచామృతాలతో , బిల్వదళాలతో పూజించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత హనుమంతుడి పూజ చేయాలి. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఎంతటి కష్టం నుంచి అయినా బయటపడతారని భక్తుల విశ్వాసం   భౌమ ప్రదోష వ్రతం 2025 గురించి తరచూ అడిగే సందేహాలు - సమాధానాలు ఇవే...

1. భౌమ ప్రదోష వ్రతంలో పాటించాల్సిన నియమాలేంటి?

కోపం తెచ్చుకోవద్దు, సాత్విక ఆహారం తీసుకోండి, పూజలో తులసి - పసుపు - కేతకి పూలను ఉపయోగించవద్దు, మధ్యాహ్నం నిద్రపోవద్దు

2. ప్రదోష వ్రతంలో ఏం తినాలి, ఏం తినకూడదు?

పండ్లు,  పిండి, ప్రసాదం, పాలు, పెరుగు , కొబ్బరి నీరు కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోకూడదు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ఇది పూర్తిగా కచ్చితమైనది అని చెప్పలేం. ఇక్కడ పేర్కొన్న సమాచారం పరిగణలోకి తీసుకుని ఆచరించే ముంందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించండి.

 .