Foxconn : భారత్‌లో ఐఫోన్ 17 తయారీకి సిద్ధమవుతున్న టైంలో బిగ్‌షాక్ తగిలింది. ఈ ఫోన్‌లో ఉత్పత్తిలో పాల్గొన్న 300 మందికిపైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను ఫాక్స్ కాన్ వెనక్కి పిలిపించింది. దీంతో ఐఫోన్ తయారీపైనే కాకుండా ఆపిల్ సంస్థ విస్తరణపై కూడా ప్రభావం పడబోతోంది. చైనీస్ సిబ్బంది వెళ్లిపోవడంతో కేవలం తైవాన్‌ సహాయక సిబ్బంది మాత్రమే మిగిలారని బ్లూమ్‌బెర్గ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ఐఫోన్ 17 తయారీపై తీవ్ర ప్రభావం

బెంగళూరు శివార్లలో ఉన్న దేవనహళ్లిలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంట్ నుంచి సిబ్బందిని తగ్గిస్తూ వచ్చారు. రెండు నెలలుగా ఈ తరలింపు ప్రక్రియ చేపట్టారని బ్లూమ్‌బెర్గ్‌ సోర్స్ చెబుతున్నాయి. ఇక్కడ ఐఫోన్ కొత్త అసెంబ్లీ యూనిట్‌ను ఫోక్స్‌కాన్ ఏర్పాటు చేస్తోంది. దీనిపై ఈ సిబ్బంది తరలింపు ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోక్స్‌కాన్ తీసుకున్న చర్య వల్ల ప్రస్తుతానికి క్వాలిటీపై ఎలాంటి ఎఫెక్ట్ లేకపోయినా కచ్చితంగా వచ్చే జనరేషన్‌కు సంబంధించిన ఉత్పత్తిపై మాత్రం కచ్చితంగా ప్రభావం ఉంటుంది.  

పోటీదారులను దెబ్బతీసేందుకు చైనా కుట్రభారత్‌తోపాటు ఆగ్నేసియా దేశాలకు స్కిల్డ్‌ సిబ్బందిని ఎగుమతి చేయడాన్ని నియంత్రించాలంటూ ఆయా సంస్థలు, స్థానిక ప్రభుత్వాలపై బీజింగ్ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ రిపోర్ట్ చేసింది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీల తయారీ సామర్థ్యాన్ని పోటీ దేశాలకు చేరకుండా చేయడమే  ఈ ఎత్తుగడ అని ఆ రిపోర్టులో తెలిపింది.  

నైపుణ్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న చైనా

ఇప్పుడు చైనా వ్యూహం చాలా ముందు చూపుతో తీసుకుందని తెలుస్తోంది. ఒకప్పుడు భారత్, వియత్నాం లాంటి దేశాలు ఎక్కువగా చైనాపై ఆధారపడి వచ్చాయి. కానీ కొన్నేళ్లుగా స్వతంత్రంగా ఎదగడం ప్రారంభించాయి. దీంతో చైనా సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. చైనాకు పోటీగా ప్రపంచ సాంకేతిక సంస్థలను ఆకట్టుకుంటున్నాయి. ఇది చైనాకు మింగుడు పడటం లేదు. అందుకే చైనా ఈ చర్యలకు ఉపక్రమించింది. చైనా కార్మికుల స్కిల్‌ను భర్తీ చేయలేనిదిగా చాలాసార్లు ఆపిల్ CEO టిమ్ కుక్ చెబుతూ వచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని చైనా బాగా యూజ్ చేసుకోవాలని భావిస్తోంది.  

ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో ఐదో వంతు భారత్‌లోనే తయారు అవుతున్నాయి. ఈ ప్లాంట్ నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైనప్పటికీ అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2026 చివరి నాటికి యుఎస్‌కు వెళ్లే ఐఫోన్‌లు ఇక్కడే తయారు చేయాలని కూడా ఆపిల్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఫోక్స్‌కాన్ తీసుకున్న నిర్ణయం, నైపుణ్యమైన వ్యక్తుల కొరత కారణంగా ఆ లక్ష్యం నెరవేరేలా లేదు. 

చైనా వెలుపల ఉన్న రెండో అతి పెద్ద ఫ్యాక్టరీ 

బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలో 13 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫాక్స్‌కాన్ యొక్క “ప్రాజెక్ట్ ఎలిఫెంట్” ఉంది. చైనా వెలుపల ఫాక్స్‌కాన్ ఏర్పాటు చేసిన రెండో అతి పెద్ద ఫ్యాక్టరీ ఇది. ఈ ఫ్యాక్టరీ రాకతో దేవనహళ్లి రూపురేఖలు మారిపోయాయి. దాదాపు నలభైవేలకుపైగా ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఇప్పటికే వేల మందికి ఉపాధి కల్పించారు. చైనా, తైవాన్‌ నుంచి సిబ్బంది రావడంతో స్థానికంగా వ్యాపారాలు, ఇతర ఉపాధి అవకాశాలు పెరిగాయి.