అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః 
హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః... 
అంటూ కార్తీకమాసం మొదలు మకరసంక్రాంతి వరకూ ఎక్కడ చూసినా శరణు ఘోష వినిపిస్తుంటుంది. ఎటు చూసినా అయ్యప్ప మాలధారులే కనిపిస్తారు. 41 రోజుల పాటూ అత్యంత నియమ నిష్టలతో దీక్ష చేస్తారు. మండల దీక్ష పూర్తయ్యే వరకూ  కఠిన నియమాలు పాటిస్తారు. చన్నీటి స్నానం, ఏకభుక్తం, పాదరక్షలు ధరించకపోవడం,నేలమీద నిద్రపోవడం, నల్లటి దుస్తులు ధరించడం సహా ఎన్నో నియమాలు పాటిస్తారు.   పాటిస్తారు. ఈ నియమాలన్నింటి వెనుక భక్తి మాత్రమే కాదు..ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. 
భక్తి -ఆరోగ్యం 
నేలమీద నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది, కండరాలు పటిష్టంగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 
తెల్లవారు జామునే నిద్రలేవడం చైతన్యానికి ప్రతీక. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. తద్వారా ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది
స్నానానంతరం దీపారాధన కాంతి ఆవరణ మొత్తాన్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తుంది. శ్రద్ధగా పూజ చేయడం వల్ల మనసు తేలికపడుతుంది. 
సామూహికంగా కలిసి ఉండటం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. ఇతర భక్తులతో ఇచ్చిపుచ్చుకునే స్వభావం మరింత పెరుగుతుంది.
నిత్యం రెండు పూటలా దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రమైన దుస్తులు ధరించడం అలవాటవుతుంది. 
క్రమం తప్పకుండా పూజలో పాల్గొనడం వల్ల సంఘంతో కలసి జీవించడం తెలుస్తుంది
అధిక ప్రసంగాలకు,  వివాదాలకు దూరంగా ఉండటం వల్ల సమయం వృధా కాకపోవడంతో పాటూ ఆలోచనా సామర్థ్యం మెరుగుపడుతుంది. 
ఒక్కపూట భోజనం చేయడం వల్ల మితాహారాన్ని ప్రోత్సహించడమే కాదు..శాఖాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 
పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యం, మనసు మెరుగుపడుతుంది 


Also Read: ఈ రాశివారు జీవితానికి అవసరమైన ఉత్తమ నిర్ణయం తీసుకుంటారు, నవంబరు 10 రాశిఫలాలు


నల్ల దుస్తులు ఎందుకు ధరించాలి
అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా నల్లని వస్త్రాలు ధరిస్తారు. ఎందుకంటే శనీశ్వరుడికి నల్లని రంగు అంటే అత్యంత ఇష్టం. ఆ రంగు బట్టలని ధరించి నిత్య పూజలో పాల్గొనేవారిపై శనిప్రభావం ఉండదని చెబుతారు. అంతేకాదు సాధారణంగా అయ్యప్ప మాల శీతాకాలంలో వేస్తారు.. ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వేడినిస్తాయి. 
 
మాలలు-గంధం ఏంటిదంతా
అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు మాలలు ధరిస్తారు.  రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు, తామర పూసల మాలలు వేసుకుంటారు. ఈ మాలలు శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తాయి. వీటికి అభిషేకం  చేసి మంత్రోఛ్చారణ ద్వారా వాటికి అయ్యప్ప స్వామిని ఆవాహనం చేసి  త్రికరణశుద్ధిగా స్వామిని సేవిస్తున్నా అని చెప్పి వేసుకుంటారు. ఇక గంధం విషయానికొస్తే కనుబొమ్మల మధ్య భాగంలో “సుషుమ్న” అనే నాడి ఉంటుంది. ఈ నాడి జ్ఞానాన్నిస్తుందని..దాన్ని ఉత్తేజితం చేసేందుకే ఆ ప్రదేశంలో గంధం, కుంకుమ ధరిస్తారని చెబుతారు.


'స్వామి' అని ఎందుకు పిలవాలి
అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు అంతర్థానమై భగవతుండి స్వరూపంగా భావించి 'స్వామి' అని పిలుస్తారు. ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం మొదలెడతాడు. జీవులన్నిటిలోను దేవుడున్నాడనే భావంతో కూడా  'స్వామి' అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు.


Also Read: సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పనులివే!


శరీరం-మనస్సు అదుపులో ఉంచడమే దీక్ష
ఒక్కమాటలో చెప్పాలంటే శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకుని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యశరణు ఘోషతో పూజిస్తారు. మనస్సు మొత్తాన్ని ఒకే విషయంపై లగ్నం చేయడమే ఈ దీక్షలో పరమార్థం. రేపు మాల వేసుకుంటామని ఈ రోజు మద్యం, మాంసం తీసుకోవడం అస్సలు చేయరాదు. మాలధారణకు కనీసం మూడు రోజుల ముందు నుంచీ పవిత్రంగా ఉండాలి. మాలధారణకు తల్లిదండ్రులు, భార్య అనుమతి తప్పనిసరిగా  ఉండాలి. జుట్టు,గోళ్లు ముందుగానే కట్ చేసుకోవాలి. తన శక్తి కొదలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి. 


ఏఏ సందర్భంలో మాల వేసుకోకూడదు
తల్లిదండ్రులు మరణిస్తే ఏడాదిపాటు మాల ధరించకూడదు
భార్య మరణిస్తే ఆరునెలల పాటు దీక్షకు దూరంగా ఉండాలి