Karwa Chauth 2025 : ఏటా ఆశ్వయుజ మాసం పౌర్ణమి తర్వాత లేదా అమావాస్య ముందు వచ్చే తదియ రోజు అట్లతదియ జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగనే కర్వాచౌత్ అంటారు. వివాహితులు సౌభాగ్యం కోసం, అవివాహితులు మంచి భర్త లభించాలని ఈ నోము నోచుకుంటారు. ఈ ఏడాది అట్ల తదియ అక్టోబరు 09 గురువారం వచ్చింది. దీనినే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ , చంద్రోదయ ఉమా వ్రతం అంటారు.

Continues below advertisement

చద్ది తినడంతో మొదలు

ప్రతి నోము, పూజ, శుభకార్యాలు ఉపవాసంతో ప్రారంభమయితే... అట్ల తదియ మాత్రం వేకువజామునే చద్ది తినడంతో ప్రారంభమమవుతుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముందు రోజు రాత్రి వండిన పదార్థాలు భుజిస్తారు. అనంతరం గోరింట పెట్టుకోవడం, ఇరుగు పొరుగు అంతా కలసి ఉయ్యాలలు ఊగడం చేస్తారు. అట్లతద్ది ఆరట్లోయ్.. ముద్ద పప్పు మూడట్లోయ్ అని  ఆడిపాడతారు. 

Continues below advertisement

11 తాంబూలాలు తీసుకుంటారు

11 ఉయ్యాలలు 11 సార్లు ఊగుతారు

11 రకాల ఫలాలు తింటారు ( ఉపవాసం సమయంలో పండ్లు తినొచ్చు)

సూర్యాస్తమయం తర్వాత 11 అట్లు చంద్రుడికి , 11 అట్లు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించి 11 అట్లు ముత్తైదువుకి వాయనం ఇస్తారు. 

ముందుగా వినాయకుడిని పూజించి..అనంతరం స్త్రీ సూక్త విధానంలో గౌరీ పూజ చేస్తారు...

పూజ పూర్తైన తర్వాత చదువుకోవాల్సిన కథ ఇది

పూర్వకాలంలో  ఓ రాజ కుమార్తె, మంత్రి కుమార్తె, పురోహితుడి కుమార్తె..ఈ ముగ్గురు మంచి స్నేహితులు. అట్ల తదియ రోజు ముగ్గురూ కలసి నోము నోచుకోవాలని అనుకుంటారు. సుకుమారమైన రాజకుమార్తె ఉపవాసం ఉండడంతో కళ్లు తిరిగి పడిపోయింది. చెల్లెలిని చూసి చలించిపోయిన అన్నదమ్ములు...ఓ మంట వేసి దానిని అద్దంలో చూపించి... చంద్రుడు వచ్చేశాడు ఇదిగో ఇక నువ్వు ఉపవాసం విరమించవచ్చు అని చెప్పారు. సోదరుల మాట విని ఉపవాసం విరమించేసింది రాకుమార్తె. ఆ తర్వాత కొన్నాళ్లకు ముగ్గురు స్నహితులకు పెళ్లిళ్లు జరిగాయ్. అట్లతదియ నోము నియమానుసారం నోచుకున్న  మంత్రి కుమార్తె, పురోహితుని కుమార్తెకు మంచి భర్త లభించగా.. రాకుమార్తెకు ముసలి వ్యక్తి భర్తగా వచ్చాడు. నేను కూడా మీతోపాటూ నోము చేశాను కదా నాకు ఎందుకు ఇలా జరిగిందని బాధపడింది. అప్పుడు ఆమె సోదరులు ఏం చేశారో వివరంగా చెప్పారు ఇద్దరు స్నేహితులు. తప్పు జరిగిందని తెలుసుకుని ఆ ఏడాది అట్లతద్ది నోము నియమానుసారం నోచుకుంది రాకుమార్తె. పూజ అనంతరం అక్షతలు తన భర్తకు అందించి ఆశీర్వాదం తీసుకుంది. ఆ అక్షతలు వేసుకున్న రాకుమార్తె భర్త కూడా యవ్వనుడిగా మారిపోయాడు. ఇదంతా ఆమె నోము ప్రారంభించి మధ్యలో విరమించిన శాప ప్రభావం అని గ్రహించారంతా. అందుకే వివాహితులు ఈ నోము నోచుకుంటే సౌభాగ్యం, అవివాహితులు అట్ల తదియ నోము నోచుకుంటే ఉత్తముడైన భర్త లభిస్తాడని పురాణాల్లో ఉంది. 

పూజ పూర్తైన తర్వాత కొన్ని ప్రాంతాల్లో దండనాలు వేస్తారు కొన్ని బియ్యం తీసుకోవాలి..రెండు గుప్పిళ్లలోకి బియ్యం తీసుకుని ఓ పీటపై కానీ, పళ్లెంలో కానీ చేతులను క్రాస్ గా ఉంచి కిందకు విడవాలి..ఇలా చెప్పాలి తల్లిదండనా..తండ్రి దండనా కలిగి ఉండాలి ( బియ్యం ఓసారి విడవాలి)

అత్త దండనా...మామ దండనా కలిగి ఉండాలి ( బియ్యాన్ని రెండోసారి విడవాలి)

పురుషుడి దండనా..పుత్రుడి దండనా కలిగి ఉండాలి

సర్గానికి వెళ్లినా సవతి పోరు వద్దు

మేడమీదకు వెళ్లినా మారెడు తల్లి వద్దు

యమ దండనా..రాచ దండనా ఎన్నటికీ వద్దు

ఇలా మూడుసార్లు చెప్పాలి..ఓసారి వినియోగించిన బియ్యం మూడుసార్లు తిరిగి వాడుకోవచ్చు.. ఇవే బియ్యాన్ని ఇంట్లో ఎంతమంది నోము నోచుకుంటే అందరూ వినియోగించవచ్చు. పూజ అనంతరం ఆ బియ్యంతో పరమాన్నం చేసి స్వామి అమ్మవార్లకు నివేదించాలి అట్లతద్ది వెనుకున్న శాస్త్రీయ కారణాలు

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు ఈ సీజన్లో లభించే ఉసిరి, గోంగూర తింటే కంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి గోరింట పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది ఆటపాటల వల్ల మానసిక ఉల్లాసం, శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది ఉపవాసం కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది

గమనిక:  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించినవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.