హిందూ ధర్మంలో అవసరంలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి భోజనం పెట్టడం చాలా ముఖ్యమైన ధర్మం. దీని వెనుక కేవలం అవసరం ఉన్న వారికి సహాయం అందించడం మాత్రమే కాదు మనం మంచి కర్మలు చేసే అవకాశం కూడా పొందుతామని హిందూ ధర్మం బోధిస్తుంది. ఈ రకంగా మూగజీవాలకు కావాల్సిన దాణా అందించడం కూడా మంచి పుణ్యకార్యం. ఏ పశువుకి ఎలాంటి దాణా అందిస్తే గోచారరీత్యా ఎటువంటి మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.


ఆవు


హిందూ ధర్మం ఆవును చాలా పవిత్ర భావనతో చూస్తుంది. సమస్త జీవ రాశికి ఆవు తల్లిలాంటిదని నమ్మకం. కొంత మంది గోపూజ కూడా నిత్యం చేస్తుంటారు. ఆవుకు దాణా అందించడం ద్వారా కుండలిలో ఉన్న గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. సంపద, వంశాభివృద్ధి ఆశించే వారు ఆవుకు పచ్చగడ్డి, గోధుమ పిండితో చేసిన మిఠాయి తినిపించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.


చేపలు


యుగాలుగా ఈ హాని చెయ్యని జీవాలకు దాణా వెయ్యడం పరిపాటిగా వస్తోంది. శతృపీడ నాశనానికి, కష్టాల నుంచి బయటపడెయ్యడానికి చేపలకు ఆహారం అందించడం ఒక సులభ మార్గం. అప్పులు చాలా ఉండి అవి తీర్చడానికి ఇబ్బంది పడుతుంటే, లేదా ఆర్థిక సంక్షోభాలు చుట్టి ముట్టి ఉంటే గోధుమ పిండితో చేసిన ఉండలు లేదా ఎండు మొక్కజొన్న గింజలు  తప్పకుండా చేపలకు ఆహారంగా వెయ్యండి. మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ ఆహారం చేపలకు సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత  అందించాలి. ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం, చేపలకు దాణా ఇవ్వడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.


కుక్కలు


కుక్కలు మనుషులతో స్నేహంగా ఉండడమే కాదు విశ్వసనీయమైనవి కూడా. కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల శని, రాహు, కేతువుల కోపం నుంచి రక్షణ పొందవచ్చు. సాధారణంగా శనివారాలు నల్లని కుక్కలకు ఆహారం ఇస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల శని ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చని నమ్మకం. నిజానికి కుక్కల రంగుతో గ్రహాలకు ఎలాంటి సంబంధం లేదు. ఏ కుక్కకు ఆహారం ఇచ్చినా దుర్ఘటనలు, ఇతర ప్రమాదాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇంట్లో కుక్కును పెంచుకునే వారు ఆ కుక్క బాగోగులు శ్రద్ధగా చూసుకోవాలి. లేదంటే గ్రహాలు ప్రతికూలంగా మారవచ్చు.


చీమలు


రాహువు వల్ల జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. చీమలకు ఆహారం వెయ్యడం వల్ల రాహువు పెట్టె కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు. చీమలకు చక్కెర, గోధుమ ఉండలు ఆహారంగా ఇవ్వాలి. చీమలకు ఆహారం అందించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. చీమల ఆవాసాలకు నష్టం కలుగకుండా చూసుకోవాలి.


పక్షులు


పక్షులకు తిండి నీళ్లు అందించడం చాలా మంచి పని. పక్షులకు జొన్నలు, సజ్జ గింజలు వెయ్యడం వల్ల మీకు చదువు, కేరీర్ కు సంబంధించిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన సంబంధ సమస్యలు ఉన్న వారు కూడా పక్షులకు ఆహారం అందించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. డాబా మీద లేదా ఆరుబయట పక్షుల కోసం నీళ్లు, తిండి ఉంచడం ద్వారా ఇంట్లోకి సమృద్ధి, విజయం వస్తుందని నమ్మకం.


Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారు బాగా సంపాదిస్తారు కానీ మానసికంగా కృంగిపోతారు అంతలోనే ధైర్యంగా దూసుకెళ్తారు