Akka Mahadevi Jayanti: నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మల్లికార్జున స్వామి మహా భక్తులలో ఒకరైన శివ శరణి అక్కమహాదేవి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అక్క మహాదేవికి పంచామృతం, అభిషేకం, జలాభిషేకం, తదితర విశేష పూజ కార్యక్రమాలు చేశారు. ఈ విశేష కార్యక్రమంలో భాగంగా ముందుగా జయంతోత్సవ సంకల్పం పఠించారు. ఆ తర్వాత కార్యక్రమం నిర్వియంగా జరిగేందుకు మహాగణపతి పూజా నిర్వహించారు. అనంతరం స్తోత్ర పఠనంతో అక్క మహాదేవికి షోడ శోపచార పూజ చేశారు.
12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివ శరణులుగా ప్రసిద్ధి పొందిన మహా భక్తుల్లో అక్కమహాదేవి ఒకరు. శ్రీశైల మల్లికార్జునస్వామి వారిని తమ భాగ్యస్వామిగా భావించి తరించింది. శ్రీశైలం మల్లికార్జున పై ఎన్నో వచనాలు చెప్పిన అక్క మహాదేవి సంస్కృతం, కన్నడ , భాషల్లో ఎంతో ప్రవీణురాలుగా చెబుతారు. ఇప్పటికీ అక్కమహాదేవి వచనాలు శివ శరణాలనే పేరుతో ఎంతో ప్రచారంలో ఉన్నాయి. కన్నడలో ఆమె 400లకు పైగా వచనాలు రాసినట్టు గుర్తించారు. ప్రతి వచనంలోనూ ‘చెన్న మల్లికార్జునా’ అనే మకుటం కనిపించడంతో అవి మహాదేవి రాసినట్టు భావిస్తారు. ఆమె వచనాల్లో శివుని పట్ల ఆమెకున్న ఆరాధన, ప్రకృతి పట్ల నమ్మకం, ఐహిక సుఖాల పట్ల వైరాగ్యం స్పష్టమవుతాయి. కన్నడలో ఈమెని తొలి రచయిత్రిగా చెబుతారు.
మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుతడి. ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు గ్రామపర్యటనకు వెళ్లి అక్కడ మహాదేవిని మోహితుడయ్యాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమేశ్వరునిపై మనసు లగ్నం చేసింది. కానీ రాజుగారి మాట వినకపోతే తన కుటుంబానికి కష్టాలు తప్పవని భావించింది. అందుకే రాజుగారిని వివాహం చేసుకునేందుకు ఒప్పుకుని మూడు షరతులు విధించింది. తనకు నచ్చినరీతిలో, నచ్చినంత సేపు పరమేశ్వరుడిని ధ్యానించుకుంటాను అన్నది ఆ మూడు షరతులలో ఒకటి. సరే అని పెళ్లి చేసుకున్న మహారాజు..కొద్దిరోజుల్లోనే ఆమె షరతులను అతిక్రమించాడు. దాంతో ఆమె కట్టుబట్టలతో రాజమందిరం నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కర్ణాటకలో వీరశైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ్ కి చేరుకుంది. అప్పటికే అక్కడ బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు వంటివారు ప్రజలందర్నీ భక్తిబాటలో నడిపిస్తున్నారు. అక్కడున్న అనుభవ మండపానికి చేరుకుని శివుడిపై తనకున్న అభిప్రాయాలను పంచుకుంది అక్కమహాదేవి. ఆమె వాదనాపటిమను, పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెకు ‘అక్క’ అన్న బిరుదు ఇచ్చారు. అప్పటి నుంచి మహాదేవి అక్క మహాదేవిగా మారింది.
అక్కమహాదేవి భక్తిని గమనించిన బసవేశ్వరుడుశ్రీశైలం వెళ్లమని సూచించారు. అలా ఎన్నో కష్టానికి ఓర్చి శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి చేరుకుంది. ఆలయానిక సమీపంలో ఉన్న గుహలో మనిషి కూర్చునేందుకు వీలుండే గుహలో ఓ మూలన తపస్సు చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లకి శ్రీశైలంలో కదళీవనంలో మల్లికార్జునిడిలో కలసిపోయింది. ఆలయ ప్రాంగణంలోని ప్రతిరోజు అక్కమహాదేవికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కార్య నిర్వహణ అధికారి, శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పినవి, కొన్ని వాస్తు గ్రంధాల్లో సూచించిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.