TTD temple news: తిరుమల మాడ వీధుల్లోనే భక్తులు చెప్పులు ధరించరు. అలాంటిది కొంత మంది భక్తులు నేరుగా చెప్పులు ధరించి అలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతోంది. ఆలయంలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బంది గుర్తించి వాటిని తీసివేయించారు. క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చే ముందు వరకూ అనేక చోట్ల తనిఖీలు, స్కానింగ్‌లు చేస్తారు. అలాంటిది.. అక్కడి వరకూ వచ్చినా ఎందుకు గుర్తించలేదన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది.
అవగాహన లేక చెప్పులతో వచ్చేసిన భక్తులు?
ఆ భక్తులు ఉత్తరాదికి చెందిన వారుగా ఉన్నారు. వారికి అవగాహన లేకపోయినా.. తిరుమలలో క్యూ కాంప్లెక్స్ లోకి వచ్చినప్పటి నుంచి పలు చోట్ల తనిఖీలు చేస్తారు. కానీ అక్కడ గుర్తించలేదు. బ్యాగులు స్కాన్ చేస్తారు కానీ కాళ్లకు చెప్పులు ఉంటాయో లేదో గుర్తించరు. నిజానికి చెప్పులు వేసుకోవడాన్నిభక్తులు అపచారంగా భావిస్తారు. అలిపిరి నుంచి లేదా శ్రీవారి మెట్ల మార్గం నుంచి నడిచి వచ్చేవారు కూడా చెప్పులు వేసుకోరు. ఎంత ఎండగా ఉన్నప్పటికి వారు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు. ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్క భక్తుడు కూడా చెప్పులతో మాడ వీధుల్లోకి కానీ.. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి కానీ రారు.
అన్నీతెలిసిన భక్తులెవరూ చెప్పులతో రారు !
అయితే ఉత్తరాదికి చెందిన వారు.. కొత్తగా తొలి సారి తిరుమల ఆలయానికి వచ్చిన వారికి మాత్రం ఈ విషయంపై పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వారికి సిబ్బంది అసలు విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ భక్తులు ఎవరూ అలా రారన్న గుడ్డి నమ్మకంతో తనిఖీల చూపు కాళ్ల వైపు ఉండటం లేదు. జేబుల్లో.. ఏముందో కూడా చూస్తున్నారు కానీ.. కాళ్లకు ఉన్న చెప్పుల గురించి పట్టించుకోలేదు. దీంతో అపచారం జరగబోయింది. ఆలయంలోకి చెప్పులతో వెళ్లకుండానే ముందే గుర్తించారు.
ఉద్దేశపూర్వకంగా కాదు.. భక్తులకు నియమాలు తెలిసేలా చేయాలి
భక్తులకు సంప్రదాయాలు, నిబంధనలు, ఆలయ సమీపంలో చేయకూడని అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగేలా కార్యక్రమాలు చేపట్టడంతో విజిలెన్స్ తనికీలు మరింత పకడ్బందీగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలాంటివి జరిగినప్పుడు లోపాలు ఎక్కడున్నాయో చూసి .. రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందని భద్రతా నిపుణులు చెబుతున్నారు.