Lord Shiva: చెడును నిర్మూలించి మంచిని పెంచేందుకే ఏ దేవుడైనా అవతారమెత్తుతాడు. వేదాలను రక్షించేందుకు, దుష్టసంహారం చేసేందుకు శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో కనిపించాడు. అయితే శంకరుడు కూడా వివిధ అవతారాల్లో కనిపించాడు. ప్రతి అవతారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ అవతారాలేంటి వాటికున్న ప్రాధాన్యత ఏంటో ఇక్కడ తెలుసుకోండి


పిప్లాద్ అవతారం
మహర్షి దధీచి ఇంట్లో పిప్లాద్ గా జన్మించాడు శివుడు. అయితే పిప్లాద్ జన్మించకముందే దధీచి ఇంటిని  వదిలి వెళ్ళిపోతాడు. తన తండ్రి  ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని  చెడు ప్రభావం అని తెలుసుకుని తపస్సు చేసి ఆ శక్తితో గ్రహమండలం నుంచి శనిని కిందకు లాగేస్తాడు. బ్రహ్మదేవుడు వరాలిస్తానని చెప్పడంతో పిప్లాద్ శనిని వదిలేస్తాడు. అప్పటి నుంచి చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండకూడదని, రావిచెట్టును పూజిస్తే శనిదోషం తొలగిపోవాలని వరం కోరాడు పిప్లాద్. 


నంది అవతారం
భారతదేశంలో చాలా ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడుగా ఉంటారని పరిగణిస్తారు.


Also Read: జూలై 31 న్యూమరాలజీ, ఈ తేదీల్లో జన్మించినవారు ఇతరులపై అతిగా ఆధారపడతారు


వీరభద్ర అవతారం
సతీ దేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు తలనుంచి వెంట్రుకలు తెంపి ఓ మైదానంలోకి విసిరేస్తాడు. వాటినుంచి జన్మించినవారే వీరభద్రుడు, రుద్రకాళి.  ఇది శివుడి అత్యంత తీవ్రమైన అవతారం. 


భైరవ అవతారం
శివుడు, బ్రహ్మ , విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పుట్టిందని చెబుతారు పండితులు. బ్రహ్మ తన ఆధిపత్యం గురించి అబద్దం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మకున్న ఐదో తలను నరికేస్తాడు. బ్రహ్మహత్యా పాతకం నుంచి తప్పించుకునేందుకే బ్రహ్మ పుర్రె పట్టుకుని 12 సంవత్సరాల పాటు బిక్షాటన చేశాడు శివుడు.


అశ్వత్థామ అవతారం
క్షీరసాగర మథన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తీసుకున్నాడు. గొంతుమండుతున్న సమయంలో ఆ విషం బయటకురాకుండా వరమిచ్చిన శ్రీ మహావిష్ణువు..భూలోకంలో ద్రోణుడి కుమారుడిగా జన్మించి వీరత్వం చూపుతావని చెప్పాడు. అశ్వత్థాముడు కూడా శివుడి  అంశే.


శరభ అవతారం
శరభ అవతారం  ఒక భాగం పక్షి,మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివ పురాణం ప్రకారం, విష్ణువు  నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం ఎత్తాడని పండితులు చెబుతారు


గ్రిహపతి అవతారం
శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడు ఇంట కొడుకుగా జన్మిస్తాడు. పేరు గ్రిహపతి. తొమ్మిదేళ్లకే మృత్యుగండం పొంచిఉందని తెలుసుకున్న గ్రిహపతి కాశీకి వెళ్లి తపస్సు చేసి అపమృత్యు దోషం తొలగించుకున్నాడు. 


దుర్వాస అవతారం
శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి ఈ రూపాన్ని ధరించాడని చెబుతారు


హనుమాన్ అవతారం
హనుమంతుడు కూడా శివుడి అవతారాలలో ఒకటే. రాముడు రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సేవ చేయటానికి శివుడు హనుమాన్ రూపంలో అవతరించాడు.


వృషభ అవతారం
క్షీరసాగర మథనం తర్వాత పాతాళానికి వెళ్లిన శ్రీ మహావిష్ణువు అక్కడ అందమైన మహిళలు పట్ల తీవ్రమైన మొహాన్ని చూపాడు. ఆ సమయంలో జన్మించిన కుమారులంతా అత్యంత క్రూరంగా ఉండేవారు. వారిని సంహరించేందుకు, శ్రీ మహావిష్ణువుని తిరిగి తీసుకొచ్చేందుకు శివుడు వృషభ అవతారం ఎత్తాడు. 


Also Read: జూలై 31 రాశిఫలాలు, ఈ రాశివారికి ఇంట్లో-కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి


యతినాథ్ అవతారం
 ఆహుక్ అనే గిరిజనుడు, ఆయన భార్య శివుడి భక్తులు. ఓరోజు శివుడు యతినాథ్ రూపంలో వాళ్లకి దర్శనమిచ్చాడు. అతిథికి ఆశ్రయం ఇచ్చేందుకు తమ గుడిసెను ఇచ్చేసి ఆ దంపతులు బయట నిద్రించారు. ఆసమయంలో ఓ మృగం దాడిచేసి ఆహుక్ ని చంపేసింది. అహుక్ భార్య కూడా చనిపోయేందుకు సిద్ధపడుతుండగా శివుడు ప్రత్యక్షమై మరుజన్మలో  నల మహారాజు, దమయంతిలుగా జన్మిస్తారనే వరమిచ్చి వారిని తనలో ఐక్యం చేసుకున్నాడు.


కృష్ణ దర్శన్ అవతారం
ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞ యాగాలు, ఆచారాలు ఎంత ముఖ్యమైనవో చెప్పేందుకు కృష్ణదర్శన్ అవతారంలో కనిపించాడని పండితులు చెబుతారు.


సురేశ్వర్ అవతారం
తన భక్తులను పరీక్షించేందుకు శివుడు సురేశ్వర్ అవతారంలో కనిపించాడు


భిక్షువర్య అవతారం
వివిధ రకాల ప్రమాదాల నుంచి తన భక్తులను రక్షించేందుకు ఎత్తిన అవతారం భిక్షువర్య


కిరీట్ 
అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు వేటగాడు కిరీట్ రూపంలో వచ్చాడు. అర్జునుడిని వధించేందుకు దుర్యోధనుడు పందిరూపంలో ఓ రాక్షసుడిని పంపిస్తాడు. ఆ పందిని అర్జునుడు-వేటగాడి రూపంలో వచ్చిన శివుడు ఒకేసారి వధిస్తారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా ద్వంద యుద్ధం జరుగుతుంది. అప్పుడు శివుడు..అర్జునుడి శౌర్యాన్ని మెచ్చి పాశుపత అస్త్రం బహుమతిగా ఇచ్చాడు


సుంతన్ తారక అవతారం
శివుడు పార్వతిని వివాహం చేసుకోవటానికి హిమవంతుడి వద్దకు ఈ అవతారంలో వెళ్లాడని పురాణ కథనం


బ్రహ్మచారి అవతారం
భర్తగా శివుడిని పొందేందుకు పార్వతీదేవి తపస్సు చేసే సమయంలో ఆమెను పరీక్షించేందుకు పరమేశ్వరుడు ఈ అవతారమెత్తాడు


యక్షేశ్వర్ అవతారం
శివుడు దేవతల మనసులో దూరి తప్పుడు ఆలోచనలు, అహాన్ని దూరం చేసేందుకు ఈ అవతారంలో కనిపించాడు


అవధూత్ అవతారం
ఇంద్రుడి అహంకారం తగ్గించేందుకు శివుడు అవధూత్ గా కనిపించాడు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.