Important Learnings from Bhagavad Gita: మనిషికి అంతిమ మార్గదర్శి భగవద్గీత. మన కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వహించాలని, మనస్సును జయించాలని, ఆత్మ శాశ్వత స్వభావాన్ని గుర్తించాలని బోధిస్తుంది. ధర్మం, అంతర్గత శాంతిలో స్థిరంగా ఉంటూ శరణాగతి పొందడమే భగవద్గీత ప్రధాన సందేశం. గీత మొత్తం చదవలేకపోయినా ఆ సందేశం క్లుప్తంగా ఇక్కడుంది
1. ఆత్మ అమరమైనది
శరీరం నాశనం అయినా ఆత్మకు చావు,పుట్టుక ఉండదు. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ అగ్నిలో కాలదు, నీరు తడపలేదు. అందుకే యుద్ధంలో చనిపోయే వారికోసం బాధపడకూడదు.
నైనం ఛిన్దంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః
భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
2. ఫలాపేక్ష లేకుండా కర్మ ఆచరించు
పని చేయాలి కానీ దాన్నించి వచ్చే ఫలితాన్ని ఆశించకూడదు. మీరు చేసే కార్యం సఫలం అయినా విఫలం అయినా సమభావనతోనే ఉండాలి. ఇది మనస్సుని స్థిరం చేస్తుంది. ప్రతి మనిషికి తనదైన ధర్మం, కర్తవ్యం ఉంటాయి..వాటిని నిర్వర్తించాల్సిందే.
3. స్వధర్మం పాటించు
తన వృత్తి, స్థానం ప్రకారం వచ్చిన ధర్మాన్ని వీడకూడదు. అర్జునుడి క్షత్రియ ధర్మం యుద్ధం చేయడమే..ధర్మం కోసం యుద్ధం చేయడం పాపం కాదు. అందుకే నీ ధనుర్భాణాలు విడిచిపెట్టిన అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడు శ్రీ కృష్ణుడు
4.సమబుద్ధి
సుఖం-దుఃఖం, లాభం-నష్టం, జయం-అపజయం..అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. ఇలాంటి స్థిరమైన మనస్సుని యోగం అంటారు
5.మనసుని అదుపులో ఉంచు
మనసు చంచలమైనది, అస్థిరమైనది. దాన్ని అభ్యాసం, వైరాగ్యం ద్వారా మాత్రమే అదుపుచేయగలం. మనసు అదుపులో ఉంచుకుంటే అదే వారికి మిత్రుడు... అదుపు తప్పిదే ఆ మనసే శత్రువుగా మారుతుంది. మనసును అదుపుచేసేవారి జీవితం మొత్తం శాంతిమయం
6.భక్తియోగం
భక్తితో నన్ను(కృష్ణుడిని) శరణు వేడితే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. భగవంతుడిని చేరడానికి నిస్వార్థమైన మార్గం భక్తి. భగవంతుడిపై పరిపూర్ణమైన విశ్వాసంతో ఏం చేసినా అది ఆయనకు చేరుతుంది
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః
7.త్రిగుణాలను అధిగమించు
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఈ ప్రకృతి మూడు గుణాలతో నడుస్తుంది. వీటిని అధిగమించి గుణాతీత స్థితికి చేరుకున్నప్పుడే మోక్షానికి చేరువవుతారు
8.జ్ఞానం ఉత్తమమైనది
కర్మ, భక్తి మార్గాలతో పాటూ జ్ఞానం, ఆత్మ-పరమాత్మ తత్వం తెలుసుకోవడం ద్వారా మనిషి బంధాల నుంచి విముక్తి పొందుతాడు. సకల పాపాలను హరించేది ఆధ్యాత్మిక జ్ఞానమే.. అజ్ఞానాన్ని మించిన చీకటి లేదు..జ్ఞానాన్ని మించిన వెలుగు లేదని గుర్తించు
9. యోగం అంటే సమత్వం
యోగస్థః కురుకర్మాణి సంగంత్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే
యోగం అంటే సమభావనతో నీ విధులు నువ్వు నిర్వర్తించడం.
10. పరమ శాంతి
భగవంతుడిని శరుణు వేడి, ధర్మాన్ని అనుసరించి, ఫలాపేక్ష వదిలి సమత్వంతో ఉన్నప్పుడే మనస్సు శాంతిని పొందుతుంది. చివరకు మోక్షం దిశగా అడుగువేస్తారు. ఈ సృష్టిలో ఏదీ భగవంతుడి ప్రణాళిక లేకుండా జరగదు భగవద్గీత చెప్పేది ఒక్కటే..ధర్మాన్ని అనుసరించు, ఫలితం ఆశించకుండా నీ కర్మలను నువ్వు నిర్వహించు..
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.
