YSRCP: రాజకీయాల్లో ప్రతీ అడుగు ఎంతో లెక్క చూసుకుని వేయాలి అంటారు. వ్యూహ ప్రతివ్యూహాలతో నిండి ఉండే పాలిటిక్స్ లో ఒక్క పొరపాటు మొత్తం రాజకీయ పార్టీ దిశను మార్చేస్తుంది. అలాంటిది జూన్ నెల వచ్చిన మొదటి వారం రోజుల్లోనే ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసిపి వరుసగా మూడు పొరపాట్లు చేసిందంటున్నారు  పొలిటికల్ ఎనలిస్ట్ లు.  అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1) తెనాలి పర్యటన- జగన్ స్పీచ్తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు రోడ్డుపై లాఠీలతో కొట్టిన దృశ్యాలు  సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్లంతా గంజాయి బ్యాచ్ అని మత్తులో కానిస్టేబుల్ ని కొట్టారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే పోలీసులు ఆ విధంగా  దండించాల్సి వచ్చిందని అధికార పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే వాళ్లు దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులనీ దేశంలో చట్టం ఉండగా ఇలా పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదని  ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయమై ప్రతిపక్షం కూడా గట్టిగానే స్పందించింది. వైసీపీ అధినేత జగన్ హుటాహుటిన తెనాలి వెళ్లి ఆ యువకులని పరామర్శించారు. అయితే అసలు ఆ ఘటనలో నిజానిజాలు ఏంటో తేలకుండా ఎందుకు అంత హడావుడిగా వెళ్లారు అనేది  ఇప్పుడు ఆయన ప్రత్యర్థి పార్టీలు వేస్తున్న ప్రశ్న. పైగా వెంటనే టిడిపి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో డాక్టర్ సుధాకర్ అంశం తెరపైకి వచ్చింది. మాస్క్ అడిగినందుకు ఆయనకు పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేదాకా పరిస్థితి తీసుకొచ్చారంటూ  అప్పటి జగన్ ప్రభుత్వంపై దాడి మొదలైంది.

మరో వైపు తెనాలిలో జగన్ ఇచ్చిన స్పీచ్ కూడా స్పష్టత లేకుండా సాగింది. నిజానికి ఇలాంటి అంశాల్లో ప్రతిపక్షాలు ముందుగా ఒక బృందాన్ని పంపించడమో, నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేయడమో రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తున్న విధానం.  పోలీసులపై చట్టపరమైన చర్యలు , ఆ యువకులపై ఉన్న కేసులు విషయం పక్కన పెడితే ఆ ముగ్గురి విషయమై స్థానికులు చెబుతున్న దాని ప్రకారం  ఎక్కువగా నెగెటివిటీనే సోషల్ మీడియాలో కనిపిస్తోంది. తెనాలి పర్యటన  జగన్‌కు గాని వైసిపి కీ కానీ రాజకీయంగా ఏ విధంగానూ లాభించని అంశం అన్న విశ్లేషణ  ఎక్కువగా వినిపిస్తోంది. ఈ విషయాల్లో వెంటనే పర్యటనకు వచ్చిన జగన్ వేగాన్ని ప్రశంసిస్తూనే ఎంచుకున్న అంశం కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఎక్కువగా వైరల్ అవుతోంది. 

2) వెన్నుపోటు దినం - జగన్ డుమ్మా 

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి  ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని కూటమి గెలిచిన జూన్ 4వ తేదీని  వెన్నుపోటు దినంగా గుర్తించాలంటూ  రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆరోజున కీలక నేతలు అందరూ  వైసీపీ శ్రేణులతో కలిసి  నిరసనలు జరిపారు. బొత్స లాంటి సీనియర్ నేత కూడా నిరసన చేస్తూ ఎండ వేడి తట్టుకోలేక నిరసన కార్యక్రమంలోనే సొమ్మసిల్లారు. 2024 ఎన్నికల తర్వాత  ఏడాది కాలంలో వైసీపీ చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇదే. దానితో కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు. కానీ విచిత్రంగా ఈ ప్రోగ్రాంకి పిలుపు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి వెన్నుపోటు దినంలో పాల్గొనలేదు. అంతకు ముందు రోజు తెనాలి పర్యటన చేపట్టిన జగన్ జూన్ 4న బెంగళూరు వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసి ముందుగా షాక్ తిన్నది వైసిపి శ్రేణులే. బహిరంగంగా వాళ్ళు చెప్పకపోయినా ఇలా ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో  పార్టీ అధినేత రాష్ట్రంలో ఎక్కడా పాల్గొనకపోవడంపై వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిన మాట వాస్తవం.

3) అమరావతి డిబేట్ ఇష్యూ హ్యాండిలింగ్ లో పొరబాట్లులేటెస్ట్ కాంట్రవర్సీ రాజధాని అమరావతి "దేవతల రాజధాని కాదు... మరో విధమైన రాజధాని అంటూ" రాయలేని భాషలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు  వ్యాఖ్యానించడం ఆ షోకి యాంకర్ గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్  కొమ్మినేని శ్రీనివాస్‌ దానిని వెంటనే ఆపకపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది. ఇదంతా వైసీపీ అనుబంధ న్యూస్ ఛానల్ గా పేరొందిన సాక్షిలో ప్రసారం కావడంతో టిడిపి శ్రేణులు మంత్రులు నాయకులు  వైసీపీపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వరుస కేసులు నమోదు చేయడంతో ఆల్రెడీ కొమ్మినేనిని అరెస్ట్ చేశారు.

మొదటినుంచి మూడు రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగనన్నట్టుగా రాజధాని ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నెమ్మదిగా రాజధాని ప్రాంతంలో బలం పెంచుకోవడానికి వైసిపి ప్రయత్నిస్తోంది. అలాంటి సమయంలో ఇలాంటి వివాదం కచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం చేసేదే. వైఫై చూసి సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకుండా సమర్ధించుకునే ప్రయత్నం చేశారు అని  అటు ఛానల్ పైన ఇటు ఆ జర్నలిస్టుపైనా విరుచుకుపడుతున్నారు రాజధాని మహిళలు, మహిళా టిడిపి నేతలు.

ఇందులోని రాజకీయ కోణం అందరికీ తెలిసిందే కానీ ఆ వ్యాఖ్యలు ప్రసారం కాగానే జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసిపి థింక్ ట్యాంక్ కచ్చితంగా పొరపాటు చేసింది అనేది ఎనలిస్టుల అభిప్రాయం. దీన్ని మరి వైసీపీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఇలా కేవలం వారం రోజుల వ్యవధిలో వైసిపి చేసిన మూడు వ్యూహాత్మక పొరపాట్లు టిడిపికి  ఆ విధంగా మారాయి అన్నది  రాజకీయ పరిణామాలు గమనిస్తున్న వారి అభిప్రాయం. మొత్తం మీద  వైసిపి  జరుగుతున్న పరిణామాలను  ఎమోషన్తో కాకుండా ఎనలైజ్ చేసుకుని ముందుకు వెళితే పార్టీకి లాభిస్తుందని ఎక్కువమంది చెబుతున్న మాట.