YS Jagan Siddham Sabha Medarametla LIVE: మేదరమెట్ల: వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోన త్వరలో విడుదల చేస్తామని ఏపీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. చేయగలిగిందే చెబుతాం, చెప్పిన ప్రతి ఒక్కటీ చేసి తీరుతామని, జగన్ మాట ఇచ్చాడంటే తగ్గేదే లేదు అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన నాలుగో సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చెప్పింది ఏదీ చేయలేదని, మేనిఫెస్టోను ఏనాడూ అమలు చేయని నేతగా నిలిచారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మ్యానిఫెస్టోకు శకుని చేతిలోని పాచికలకు తేడాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.




చంద్రబాబు సున్నా అని, దాని పక్కన ఎన్ని బోడి పార్టీలు కలిసినా దాని విలువ సున్నానే అంటూ సెటైర్లు వేశారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే పొత్తుగా ఏర్పడి ఇచ్చిన హామీలు.. రైతులకు రుణమాఫీపై తొలి సంతకం, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయడం, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీ పేరిట రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేయడం, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే జాబ్ వచ్చే వరకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇలా చెప్పిన ఏ విషయాన్ని అమలు చేయని వ్యక్తులు ఆ కూటమిలో ఉన్నారని జగన్ గుర్తుచేశారు.


ఎన్నికల్లో నెగ్గాలని చంద్రబాబు కుట్రలు 
అధికారంతో ప్రజల్ని దోచుకుని, పంచుకునేందుకు ఎన్నికల్లో నెగ్గాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తాము కరోనా కష్ట సమయంలోనూ సాకులు చూపకుండా మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ పథకాలు అందిచ్చామన్నారు. 2 లక్షల 65 వేల కోట్లు బటన్ నొక్కగానే నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోకి చేరాయని తెలిపారు. పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని జగన్ పేర్కొన్నారు. 




2024 ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వం సైతం.. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన 8 పథకాలను తరువాత కూడా కొనసాగించాల్సి ఉంటుందన్నారు. 66 లక్షల పెన్షన్లకు రూ.24 వేల కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్ రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రూ.4,600 కోట్లు, ఆరోగ్యశ్రీ, 104, 108 కచ్చితంగా అమలు చేయాలి. మరో రూ.4,400 కోట్లు, విద్యా దీవేన, వసతి దీవెన కింద రూ.5 వేల కోట్లు, సంపూర్ణ పోషణ కింద రూ.2,200 కోట్లు, గోరుముద్ద కింద మరో రూ.1900 కోట్లు.. ఈ 8 పథకాలు ఎవరూ టచ్ చేయలేరని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకాలకు రూ.52,700 కోట్ల రూపాయలు అవుతుందని సీఎం జగన్ తెలిపారు. 



మేనిఫేస్టోలో 90శాతం అమలు చేశాం, నాయకుడంటే.. ఇది పార్టీ అంటే ఇలా ఉండాలన్నారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండా ఉంటా, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి పేదకు మంచి చేశాం, రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఇంటికి మంచి జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో మంచి జరిగి నేరుగా రూ.20కోట్లు ప్రతి గ్రామానికి చేరాయని, అందుకే వై నాట్ 175 అని, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా తగ్గకూడదు అన్నారు.