అమరావతియే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి టు అరసవల్లి వరకు యాత్ర పయనమవుతున్నారు. ఈ యాత్రపై ఇప్పటి వరకు విమర్సలకే పరిమితమైన అధికార పార్టీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కౌంటర్ అటాక్‌ను మొదలు పెట్టింది. వాళ్లకు సపోర్ట్ చేస్తున్న విపక్షాలను కూడా డిఫెన్స్‌లో పెడేసేందుకు భారీ స్కెచ్ వేసింది.


ముఖ్యమంత్రి ఓకే అంటే రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ప్రత్యక్ష ఉద్యమంలో దిగుతాను అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన 24 గంటలు కాక ముందే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అదే కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. కరణం ధర్మశ్రీ అయితే ఏకంగా రాజీనామా లెటర్‌ను కూడా వికేంద్రీకరణ జేఏసీకి ఇచ్చేశారు. మరో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ తాను కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. 


మొత్తానికి ఇన్ని రోజులు విమర్శలు, ప్రభుత్వ విధానాలు వివరించడానికే పరిమితమైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా ఉద్యమంలోకి ఎంటర్‌ అవుతున్నారనే అనుకోవాలి. అమరావతి రైతులు పోరాటం మొదలై ఇప్పటి వెయ్యిరోజులకుపైన అయింది. అప్పటి నుంచి ప్రస్తావ వచ్చినప్పుడల్లా ఆ ఉద్యమంపై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ వచ్చారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర టైంలో కూడా చాలా ఆరోపణలు చేశారు. 


ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రలోని దేవాలయానికే పాదయాత్రగా అమరావతి రైతులు వెళ్లడం అధికార పార్టీని కవ్వించినట్టైంది. పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఎదురు దాడి మొదలైంది. కృష్ణాజిల్లా నుంచి అటు శ్రీకాకుళం జిల్లా వరకు రోజూ ఏదో చోట మేదోమథనాలు జరుపుతోంది వైసీపీ. అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రజల్లో సెంటిమెంట్‌ రగిల్చే ప్రయత్నాలు చేస్తోంది. ఆయా సభల్లో మంత్రులే పాల్గొని అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడటం... ఉత్తరాంధ్ర కోసం పోరాడాలంటూ ప్రజలకు పిలుపు ఇవ్వడం చూశాం. 


ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని కోసం వికేంద్రీరణ కోసం జేఏసీ ఏర్పాటు అయింది. ఆ వేదికను పంచుకున్న వైసీపీ లీడర్లు సీరియస్ కామెంట్స్ మరోసారి చేశారు. ఉద్యమ పంథాను స్పష్టం చేశారు. మరింత మంది యువతను ఇందులో భాగం చేసేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తుగడ వేశారు. అమరావతి రైతులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే నాటికి సెంటిమెంట్‌ను వీలైనం ఎక్కువ రాజేసేలా ప్లాన్ చేశారు. 


ఈ ప్లాన్‌తో ప్రజలను ఉద్యమంలోకి తీసుకురావడంతోపాటు అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్న టీడీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వైసీపీ రాజీనామా అస్త్రాలను తెరపైకి తీసుకొచ్చింది. గతంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడా అదే మాదిరిగా టీడీపీని డిఫెన్స్‌లో పడేసేంది వైసీపీ. ఇప్పుడు కూడా అదే మాదిరి స్కెచ్‌ వేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. 


అందుకే రాజీనామాకు సిద్ధమంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు... టీడీపీ లీడర్లు అమరావతికి అనుకూలంగా రాజీనామాలు చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు. మొన్నటి వరకు అమరావతి రైతులను తమ ప్రాంతంలోకి వస్తే తరిమికొడతామని అడ్డుకుంటామని నేతలు ఒక్కసారిగా గొంతలు సవరించుకొని రాజీనామాల బాట పట్టారు. ఇప్పుడు టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.