YSRCP part time politics: ఏపీలో అధికార పార్టీ అగ్రనేతలు తమ ఎమ్మెల్యేలను దారిన పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అలాంటి రాజకీయ పరిస్థితుల్ని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లోలేదు. 2024 ఎన్నికల్లో ఊహించని ఓటమి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారు. బెంగళూరుకు స్థిరనివాసం మార్చారు. వారానికి రెండు, మూడు రోజులే తాడేపల్లికి వస్తున్నారు. సీనియర్ నేతలు కూడా అలాగే ఉన్నారు. కొంత మంది ప్రెస్ మీట్లకు పరిమితమైతే చాలా మంది ఆ పని కూడా చేయడం లేదు. దీంతో వైసీపీ రాజకీయం పూర్తి స్తబ్దుగా మారిపోయింది.
బుగ్గన నుంచి ధర్మాన వరకూ అందరూ సైలెంట్
పార్టీ ఓడిపోయాక.. కొంత మంది నేతలు పార్టీ వీడిపోయారు. పార్టీలో ఉన్న వారు యాక్టివ్ గా లేరు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ధర్మాన సహా ఎవరూ రాజకీయాలు చేయడం లేదు. బొత్స సత్యనారాయణ అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెడుతున్నారు. దీనికి కారణం జగన్ తీరేనని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఎవరి సూచనలను తీసుకోలేదు. కనీసం ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోలేదు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడంతో పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. సీనియర్ నేతలు కూడా జగన్ పరిపాలన తీరుతో నొచ్చుకున్నారు. అందుకే తర్వాత సైలెంట్ అయ్యారు.
కేసుల భయంతో కొంత మంది ఆజ్ఞాతం వైసీపీలో సీనియర్ నేతలు బయటకు రావడం లేదని పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం ఇటీవల జగన్ తాడేపల్లికి పిలిపించుకుని క్లాస్ పీకుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటి నేతలు నోరు మెదిపితే కేసులు పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. జోగి రమేష్ నుంచి రోజా వరకూ అందరి కథ అదే. జోగి రమేష్ కొన్నాళ్లు జైలుకెళ్లకుండా పోరాడారు కానీ తర్వాత తప్ప లేదు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలా నోరున్నా నెతలంతా ఇప్పుడు వీలైనంత మౌనం పాటిస్తున్నారు. పేర్నినానితో పాటు అంబటి రాంబాబు మాత్రమే ఎక్కువగా మీడియా ముందుకు వస్తున్నారు. వీరంతా గతంలో టీడీపీ నేతల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టిన వారే.
సజ్జల తీరుతో మరికొంత మంది అసంతృప్తి
వైఎస్ఆర్‌సీపీలో సీనియర్ నేతల చురుకుతనం లేకపోవడానికి మరో ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం. జగన్ చుట్టూ ' కోటరీ ఉందని .. వారే నిర్ణయాలు తీసుకుంటూ, సీనియర్ నేతలు, కార్యకర్తలు జగన్‌ను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ కోటరీకి నాయకుడు సజ్జల అని చెబుతారు. పార్టీ పరమైన నిర్ణయాలను జగన్ పట్టించుకోవడం లేదు. అంతా సజ్జలే చేస్తున్నారు. సజ్జల ఆదేశాలను తాము పాటించడం ఏమిటని సీనియర్ నేతలు కార్యక్రమాలు తగ్గించుకున్నారు.
జగన్ యాక్టివ్ అయితేనే మిగతా లీడర్లు !
పార్టీ అధినేత జగన్ గతంలోజిల్లాలు పర్యటిస్తామని చెప్పారు.కానీ ఇప్పుడు అలాంటి ఆలోచనలు పెట్టుకోవడం లేదు. జగన్ పార్ట్ టైమ్ గా రాష్ట్రానికి వచ్చి పోతూంటే..తాము మాత్రం ఎందుకు కష్టపడాలని సీనియర్లు అనుకుంటున్నారు. వారందరికీ జగన్ మళ్లీ పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తేనే ధైర్యం వస్తుంది. కానీ జగన్ పాదయాత్ర వరకూ మళ్లీ పూర్తి స్తాయి రాజకీయాలు చేసే అవకాశాల్లేవని ఎక్కువ మంది నమ్ముతున్నారు.