Vijaysaireddy On Rahul : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు ఈడీ ప్రతినిధులు ప్రశ్నిస్తూండటాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి కర్మ సిద్ధాంతం చాలా గొప్పది. దీని ప్రకారం పుణ్యం చేస్తే పుణ్య ఫలాలు, పాపం చేస్తే పాప ఫలాలు అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. 





రాహుల్ గాంధీపై ఇలా విజయసాయిరెడ్డి ట్వీట్ ఎటాక్ చేయడం ఇదే మొదటి సారి కాదు ఫ్రీక్వెంట్‌గా ఆయనపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈడీ ఆఫీసులోకి మాస్క్ పెట్టుకుని వెళ్తున్న రాహుల్ గాంధీపై రెండు రోజుల కిందట సెటైర్లు వేశారు.  నానికి రాహుల్ గాంధీ ముఖం చూపించ‌లేక‌పోతున్నార‌ని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా 2024 ఎన్నిక‌ల త‌ర్వాత అస‌లు జ‌నంలోకి రావాలంటే రాహుల్ గాంధీకి ఏకంగా పీపీఈ కిట్ అవ‌స‌ర‌మ‌వుతుందేమోనంటూ మ‌రో కామెంట్ చేశారు. 





రాహుల్ గాంధీ పాపం చేశారని.. అందుకే ఆయన అనుభవిస్తున్నారన్నట్లుగా విజయసాయిరెడ్డి చెప్పడంతో రాహుల్ గాంధీ చేసిన పాపం ఏమిటని సోషల్ మీడియాలో ఆయనను కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండి పడింది. జగన్ ఫ్యామిలీకి గాంధీ కుటుంబం ఆశీర్వాదం లేకుంటే మీరు ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకులు ఎక్కడివని ప్రశ్నించింది. 



కొద్ది రోజుల కిందట నేపాల్‌లో ఓ పెళ్లికి రాహుల్ గాందీ హాజరయినప్పుడు కూడా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఆయన చైనా హనీ ట్రాప్‌లో పడ్డారని ఆరోపించారు. విషయం తెలియకుండా ఆరోపణలు చేసినా తర్వాత విజయసాయిరెడ్డి ఎలాంటి కరెక్షన్ చేసుకోలేదు.