AP By-Elections Risk TDP:   ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో సభను బహిష్కరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగ నిరసనలు, ఇతర ప్రజాసమస్యలపై రోడ్డెక్కడంపై కూటమి ప్రభుత్వం ఘాటుగానే స్పందిస్తోంది. సభకు రాకుండా ప్రభుత్వ సదుపాయాలు అనుభవిస్తున్నారనే విమర్శలు చేస్తోంది.  అయితే ధైర్యముంటే రాజ్యాంగబద్ధంగా మాపై అనర్హత వేటు వేసుకోండి  అంటూ వైసీపీ విసిరిన సవాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వేడిని రగిల్చింది. ఒకవైపు రాజ్యాంగ సూత్రాలు, మరోవైపు స్పీకర్ అధికారాన్ని సవాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతోనే వైసీపీ ఈ అడుగు వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Continues below advertisement

 రాజ్యాంగం ఏం చెబుతోంది? 

సభకు హాజరుకాని ప్రజాప్రతినిధులపై చర్యలకు సంబంధించి భారత రాజ్యాంగంలోని  ఆర్టికల్ 190(4) స్పష్టమైన వెసులుబాటు కల్పించింది. ఒక సభ్యుడు సభ ముందస్తు అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల  సభా పనిదినాలు గైర్హాజరైతే, ఆ స్థానాన్ని ఖాళీగా  ప్రకటించే అధికారం శాసనసభకు, స్పీకర్‌కు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సాంకేతిక అంశం ఉంది. సభ వరుసగా నాలుగు రోజులకు మించి వాయిదా పడితే ఆ రోజులను ఈ 60 రోజుల వ్యవధిలో పరిగణించరు. సాధారణంగా ఏపీ అసెంబ్లీ ఏడాదికి 15-20 రోజులే నడుస్తుంది కాబట్టి, సభా పనిదినాల ప్రాతిపదికన 60 రోజులు పూర్తి కావడం అనేది చట్టపరంగా చాలా సమయం తీసుకునే ప్రక్రియ.

Continues below advertisement

 వైసీపీ  సానుభూతి  మైండ్ గేమ్‌ 

వైసీపీ ఈ అనర్హత సవాలును ఒక వ్యూహాత్మక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోంది. తమపై అనర్హత వేటు వేస్తే, దాన్ని ప్రజల్లో  తమ గొంతు నొక్కేశారనే  కోణంలో సానుభూతిగా మార్చుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. సభను బహిష్కరిస్తే అనర్హతా వేటు వేశారని ప్రజల్లోకి పోయి సానుభూతి పొందే ప్రయత్నాలు చేస్తారని అనుకుంటున్నారు. 

 ప్రభుత్వం అడుగులు ఎలా ఉంటాయి? 

ఒకవేళ నిజంగానే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, 6 నెలల వ్యవధిలో ఆయా స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. సాధారణంగా ఉపఎన్నికలు అనేవి అధికారంలో ఉన్న పార్టీకి సిట్టింగ్ స్థానాల కంటే ప్రతిపక్ష స్థానాల్లో రిస్క్‌తో కూడుకున్నవి. ఒకవేళ ఉపఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలో ఫలితం అటూ ఇటైనా, అది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే సందేశాన్ని ఇస్తుందని కూటమి భావించవచ్చు. అందుకే అనర్హత వేటు వేసి వైసీపీ కోరుకుంటున్న ఉపఎన్నికల డ్రామా కు వేదిక ఇవ్వడం ప్రభుత్వానికి తక్షణ ప్రాధాన్యత కాకపోవచ్చు.

 స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యూహం ఏమిటి? 

సభా నియమావళి, రాజ్యాంగ నిబంధనలను పక్కాగా అమలు చేస్తానని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే సభ త్వరితగతిన అనర్హత వేటు వేయకుండా చట్టపరమైన ప్రక్రియను పాటించే అవకాశం ఉంది. మొదట గైర్హాజరీపై షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సభా హక్కుల కమిటీ కి పంపడం, లేదా  నో వర్క్ - నో పే సూత్రం ప్రకారం సభకు రాని రోజులకు వేతనాలు , భత్యాలను నిలిపివేస్తూ ఆర్థిక పరమైన చర్యలకు మొగ్గు చూపడం వంటి మార్గాలను స్పీకర్ పరిశీలించవచ్చని అంచనా వేస్తున్నారు.     అనర్హత వేటు వ్యవహారం ఏపీ రాజకీయంలో ఒక పొలిటికల్ చెస్ గేమ్‌లా మారింది. ఒకవైపు అనర్హత వేటు ద్వారా సానుభూతి పొందాలని వైసీపీ చూస్తుంటే, వారికి ఆ అడ్వాంటేజ్ ఇవ్వకుండా చట్టపరమైన, సాంకేతిక నిబంధనల ప్రకారం కట్టడి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. స్పీకర్ తీసుకునే తదుపరి నిర్ణయం ఏపీ అసెంబ్లీ చరిత్రలో మరో కీలక ఘట్టంగా మారనుంది.