YSRCP MLA Joga Rao Viral Video: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నోటిఫికేషన్ రాకముందే...ఎన్నికల తాయీలాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్షంగా నేతలు రెచ్చిపోతున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్లు రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకే ఓటు వేసేలా...తమ నియోజకవర్గాల్లో ఓటర్లను వివిధ రకాలుగా ఓటర్లను లోబర్చుకుంటున్నారు. అధికార పార్టీ శాసనసభ్యులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బహుమతులు అందజేస్తున్నారు. మొన్న అంబటి రాంబాబు వాలంటీర్లకు గిఫ్టు కవర్లు ఇస్తే...నిన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్వీటు బాక్సుల్లో నగదు పంపిణీ చేశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 


తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే (Ycp MLA ) అలజంగి జోగారావు (Alajangi Jogarao)...ఓ అడుగు ముందుకు వేశారు. నియోజకవర్గంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు...ప్రయత్నిస్తున్నారు. పబ్లిక్ గా షామియానా వేసి...అనుచరుల మధ్య మహిళలకు యథేచ్చగా నగదు, చీరలు పంపిణీ చేశారు. ఎడమ చేత్తో ప్యాంట్ జేబు నుంచి 5వందల నోటు...కుడి చేత్తో చీర పంపిణీ చేశారు. రెండు మూడు నోట్లు వస్తే...జేబులోకి తోసేసి...సింగిల్ నోటును మహిళలకు ఇచ్చారు. చీరలు, నగదు తీసుకునేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. క్యూలో నిలబడి మహిళలు 5వందల నగదుతో పాటు చీరలు తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగారావు నగదు, చీరల పంపిణీకి సంబంధించిన వీడియో... సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నోటిఫికేషన్ రాకముందే ఈ స్థాయిలో నగదు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ నేతలు...నోటిఫికేషన్ వస్తే ఇంకెంత పంపిణీ చేస్తారోనన్న ప్రచారం మొదలైంది. 


అలజంగి జోగారావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి... పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులుపై 24 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది....తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు.