Nellore Police : నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు పర్యటన తర్వాత ఒకరోజు గ్యాప్ లో టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తూ పోలీసులు సోదాలు మొదలు పెట్టారు. పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేశారన్న ఆరోపణలతో సోదాలు చేపట్టినట్టు సమాచారం. అయితే సోదాలు జరుగుతున్న ఇళ్లన్నీ టీడీపీ నేతలవే కావడం, అందులోనూ మాజీ మంత్రి, నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ అనుచరులవే కావడంతో ఇది రాజకీయ కక్షసాధింపు చర్యగా భావిస్తున్నారు.
నెల్లూరు పోలీసులు మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లను టార్గెట్ చేశారు. ఈరోజు తెల్లవారు ఝామునుంచే వారు నారాయణ అనుచరుల ఇళ్లకు వెళ్లి సోదాలు జరిపారు. ఇవి రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న సోదాలంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత విజేత రెడ్డి ఇంట్లో ఉదయాన్నే పోలీసులు వచ్చి సోదాలు చేశారు. వారు అక్కడ ఉండగానే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. సోదాల పేరుతో టీడీపీ నేతల్ని వేధిస్తారా అని ప్రశ్నించారు. నెల్లూరు నగరంలోని రామలింగాపురంలో నారాయణకు సన్నిహితులైన కోట గురుబ్రహ్మం, డి. రమణారెడ్డి నివాసాల్లో కూడా పోలీసులు సోదాలు చేపట్టారు. బాలాజీ నగర్ పరిధిలోని మొత్తం నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చూస్తే సుమారు 10 నుంచి 20 మంది నాయకుల నివాసాల్లో తనిఖీలు చేసినట్టు సమాచారం. ఈ సోదాలపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు. టీడీపీ నేతలు మాత్రం తనిఖీల పేరుతో తమని వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నెల్లూరులో రోజుల వ్యవధిలోనే రాజకీయం రంజుగా మారింది. వైసీపీ నుంచి నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సడన్ గా టీడీపీలో చేరడంతో వ్యవహారం మొత్తం మారిపోయింది. ఆ తర్వాత వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని బరిలో దింపాలని నిర్ణయించింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వేమిరెడ్డి చేరిక కోసం నేరుగా చంద్రబాబే నెల్లూరుకు రావడంతో ఆయనకు టీడీపీ ఎంత ప్రయారిటీ ఇస్తోందో అర్థమవుతోంది. అదే సమయంలో వేమిరెడ్డితోపాటు నెల్లూరు సిటీ బరిలో ఉన్న నారాయణకు కూడా బలమైన ఆర్థిక మూలాలు ఉండటంతో వైసీపీ ఆలోచనలో పడింది. అందులో భాగంగానే ఈరోజు నారాయణ వర్గాన్ని భరభ్రాంతులకు గురి చేస్తూ పోలీసులు సోదాలు చేపట్టారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
నెల్లూరు సిటీలో ఈసారి నారాయణ విజయం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ నెల్లూరుకు దూరం జరగాల్సి వచ్చింది. ఆయన నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన స్థానంలో మైనార్టీ నాయకుడు ఖలీల్ కు వైసీపీ టికెట్ ఖాయమైంది. దీంతో నారాయణలో గెలుపు ధీమా పెరిగింది. అటు వైసీపీ నుంచి వలసలు పెరిగిపోవడంతో నెల్లూరు సిటీలో పార్టీ పట్టుకోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ దశలో పోలీసుల సోదాలు కలకలం రేపాయి. నారాయణ అనుచరుల ఇళ్లను టార్గెట్ చేస్తూ పోలీసులు ఉదయాన్నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సోదాల్లో వారికి ఏమేం దొరికాయి, నగదు లభించిందా లేదా అనేది పోలీసులు బయటపెట్టాల్సి ఉంది. టీడీపీ నేతలు మాత్రం ఈ సోదాలతో భయపడిపోయారు. పోలీసులే నగదు తీసుకొచ్చి తమ ఇంట్లో పెడతారేమోనని, కావాలనే తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.