Training For YSRCP MLA PAs : ఎమ్మెల్యేలకు రాజకీయ పార్టీలు శిక్షణా తరగతులు పెట్టడం చాలా సార్లు జరిగింది. కానీ ఎమ్మెల్యేల పీఏలకు కూడా ఇలా ట్రైనింగ్ క్లాసులు పెట్టడం అరుదు. ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేల పీఏల విధులు కూడా కీలకం అని భావిస్తోంది. అందుకే ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. వారి కోసం తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ ఆఫీసులో ప్రత్యేక్ష శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పుడు విజసాయిరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేల పీఏలకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
గడప గడపకూ వెళ్తున్న ఎమ్మెల్యేల పీఏలకూ ట్రైనింగ్
ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలా వెళ్తున్నప్పుడు ప్రజలు అనేక రకాల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నారు. వినతి పత్రాలు ఇస్తున్నారు. సీఎం జగన్ ఈ కార్యక్రమం పెట్టిన ఉద్దేశం ప్రజల సమస్యలను గడప వద్దే పరిష్కరించడం. అయితే జనంలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు, ఆర్జీలను తీసుకుంటున్నారు కానీ పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారు. నిజానికి ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకోవాల్సింది.. వినతి పత్రాలు తీసుకోవాల్సింది పర్సనల్ అసిస్టెంట్లే. ఎమ్మెల్యేలు ఇతర పనుల వల్ల దృష్టి పెట్టలేకపోయినా పీఏలే వాటి సమస్యల పరిష్కారానికి ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది.
ప్రజల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారానికి యాప్
ప్రజల సమస్యలకు స్పందించడం కీలకంగా కాబట్టి పీఏల పాత్ర ముఖ్యమైనదని వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతలు గుర్తించారు. అందుకే ఓ ప్రత్యేకంగా యాప్ కూడా తయారు చేయించారు. ఎమ్మెల్యేలకు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేసి పరిష్కారనికి ఫాలో అప్ చేసేలా కొన్ని బాధ్యతలు అదనంగా ఇస్తున్నారు. ఈ అంశంపై మరింత ట్రైనింగ్ అవసరం కాబట్టి పీఏలను ఆఫీసుకు పిలిపించి మరీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ట్రైనింగ్‌లో పాల్గొంటున్న ఐప్యాక్ బృందం
గడపగడపూ కార్యక్రమాన్ని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరగడం కీలకమనుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెడుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్న ఐ ప్యాక్ కూడా కొత్త సలహాలు, సూచనలు ఇస్తోంది. ఈ ప్రకారమే గడప గడపలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంటే.. వైఎస్ఆర్‌సీపీలో ఎమ్మెల్యేలే కాదు వారి పీఏలకూ ప్రాధాన్యం ఉందన్నమాట.