YV Subba Reddy: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్న, సీఎం జగన్ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవని, జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు తిరిగి సీఎంగా చూడాలనుకుంటున్నారని అన్నారు.
ఇక పోటీ విషయం గురించి వైవీ మాట్లాడుతూ సీఎం జగన్ నేరుగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన పోటీ విషయం గురించి మాట్లాడుతూ ఎక్కడ పోటీచేయాలో నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని వెల్లడించారు. మాజీమంత్రి బాలినేనిపై కుట్రల గురించి ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదన్నారు. బాలినేనిపై కుట్రలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆయన తన కుటుంబ సభ్యుడని అన్నారు. కుట్రలు చేయాలనే ఆలోచన కూడా తనకు లేదని తేల్చి చెప్పారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను తనవంతుగా నిర్వర్తించుకుంటూ వెళ్తున్నట్టు వివరించారు.
చంద్రబాబు ఐటీ నోటీసులపైనా స్పందన
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు రావడంపై వైవీ స్పందించారు. ఏమి చేయకుండా ఊరికే ఐటీ నోటీసులు రావు కాదా అంటూ ప్రశ్నించారు. అక్రమంగా నిధులు వచ్చాయని నిర్ధారణ అయ్యాకే ఐటీ సమన్లు ఇస్తారని పేర్కొన్నారు. తాను నిజాయితీపరుడిని అని చెప్పుకునే ఐటీ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన అవినీతికి నిదర్శనాలే ఐటీ నోటీసులని పేర్కొ్న్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు కమీషన్లు, వాటాలు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు. పవన్ ఎన్ని యాత్రలు చేసినా.. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గెలుపు వైసీపీదే అన్నారు.
ప్రత్యేక హోదా, రాష్ట్రానికి సంబంధించిన పథకాల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రధానిని కలిసిన ప్రతీసారీ సీఎం జగన్ ప్రత్యేక హోదాపై విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రానికి స్పష్టమైన మెజారిటీ రాకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఏపీ ఎంపీ సీట్లు కీలకం అవుతాయాన్నారు. అప్పుడు కచ్చితంగా హోదా సాధించుకోవచ్చని పేర్కొన్నారు. దొంగ ఓట్ల విషయంలో చంద్రబాబు వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారో త్వరలో బయటకు వస్తుందన్నారు. దొంగ ఓట్లు లేకపోతే టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు భయమన్నారు.
చంద్రబాబుకు ఎన్నికలను నేరుగా ఎదుర్కొనడం రాదని, ప్రతిసారీ ఎవరో ఒకరి బలంతోనే సీఎం అయ్యారని అన్నారు. చంద్రబాబుకు సొంత బలం లేదన్నారు. లోకేష్ పాదయాత్రకు స్పందన లేదని, ఉనికి కాపాడుకోవడానికి పాదయాత్ర పేరుతో టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సీఎంని నోటికొచ్చినట్లు దుర్బాషలాడటం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిస్టానం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఎలా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలుసునన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు.