క్రికెటర్ రాజకీయ ఎంట్రీ దాదాపు ఖరారు అయింది. ప్రజా క్షేత్రంలో పొలిటికల్ మ్యాచ్‌కు రెడీ అయ్యారు అంబటిరాయుడు. అందుకే తాను పోటీ చేయబోయే ప్రాంతాల్లో పరిచయాలు పెంచుకొనేందుకు ఆవగాహన టూర్‌లు చేస్తూ ప్రజలలో మమేకం అవుతున్నారు. కాపుల ఓట్లను కాపాడు కొనేందుకు ఆ క్రికెటర్ కొంత మేరకు ఉపయోగపడతాడని భావిస్తోంది అధికార పార్టీ. పవన్ మేనియా నుంచి కొంతవరకైనా కాపు ఓటర్లను సైడ్ చేస్తారని అనుకుంటున్నారు. 


అంబటి తిరుపతిరాయడు దేశమంతా పెద్దగా పరిచయనవసరం లేని పేరు. ఇక తెలుగు రాష్ట్రాలలో సరేసరి. గుంటూరు జిల్లా వాసులైతే కులమతాలకు అతీతంగా తమ వాడంటూ గర్వంగా చెప్పుకుంటారు. గుంటూరు జిల్లా వెల్లలూరు అంబటి రాయుడి స్వస్థలం. క్రికెటర్‌గా ఒక వెలుగు వెలిగారు ఇంటర్నేషనల్ క్రికెట్, టీ20 ఫార్మాట్‌లో తనకంటూ ఒక ప్రక్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన మనసు రాజకీయాలపైకి మళ్లింది. ప్రజాసేవ చేయడమే తన లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఎక్కువ మందికి సేవ చేయాలంటే రాజకీయాలే మంచి వేదిక అంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి అంబటి రాయుడు అరగేట్రం ఖాయమని అర్థమైంది. అయితే ఏ పార్టీలోకి వెళతారు అన్న సస్పెన్స్‌ కూడా ఉండేది. 


ఆవగాహన టూర్లతో హడావుడి


ఊహాగానాలకు తెరదించుతూ అంబటిరాయుడు వైసీపీలోకి వెళ్తున్నట్లు స్పష్టం అయింది. ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతున్న సమయంలోనే రెండు సార్లు సీఎం జగన్‌ని కలిశారు. జగన్ కూడా రాయుడు రాకను స్వాగతించినట్టు సమాచారం. దానికి తోడు రాయుడు కాపు సామాజిక వర్గం కావడం మరింతగా కలసి వచ్చింది. గుంటూరు ఎంపీ సీటును అంబటి రాయుడికి ఆఫార్ చేసినట్లు వినికిడి.


ఈ వాదనకు మరింత బలం చేకూరేలా రాయుడు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని గ్రామాలను కలియతిరుగుతో ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఇప్పటికే తన తండ్రి స్వగ్రామమైన పొన్నూరు నియోజకవర్గం వెల్లలూరు, తల్లి జన్మస్థలమైన తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో, తెనాలి నియోజకవర్గం కొలకలూరు పర్యటించారు.‌‌ ఆయాప్రాంతంలోని రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. కౌలు రైతుల‌ ఇబ్బందులు, సాగు సమయంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే పనితీరును పరిశీలించారు. సమాజంలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నారు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాలు చేస్తూ పొలిటికల్ ఫ్లాట్ ఫాం నిర్మించుకొనే ప్రయత్నం చేస్తున్నారు అంబటి రాయుడు.


గుంటూరు ఎంపీగా!
వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా రాయుడు పోటీ చేయబోతున్నారని వార్త అయితే హల్ చెల్ చేస్తోంది. సీఎం జగన్ గుంటూరు పార్లమెట్ నుంచి రాయుడు పోటీ చేయాలని కోరారట. పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నుకొని  హస్తినకు పంపితే తనకు, పార్టీకీ బాగా యూజ్ అవుతారని భావించారట. గత ఎన్నికలలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి అపజయం పాలైన మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రస్తుతం ఇన్ యాక్టీవ్‌గా ఉండటంతో రాయుడికి ఆ ప్లేస్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


జగన్‌కు వ్యతిరేకంకంగా పవన్ కల్యాణ్ కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో ‌కాపులు దూరమయ్యే ప్రమాదం ఉంది. వైసీపీలో ఉన్న కాపు లీడర్లలలో పవన్‌కు సరితూగే వ్యక్తి లేరు. దీంతో పార్టీకి డ్యామేజీ తప్పదని సంకేతాలు వస్తున్నాయి. నిర్ణయాక శక్తిగా ఉన్న కాపు ఓట్లు పవన్ వెంట ఉంటే వైసీపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిస్తితులలో కాపు సామాజిక వర్గంలో‌ యువతలో‌ క్రేజ్ ఉన్న  అంబటి రాయుడు రాక వైసీపీకి బూస్ట్‌ లాంటిందని అంటున్నారు. 


స్టార్ క్యాంపెయినర్
అన్ని వర్గాల్లో క్రేజ్ ఉన్న అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకుంటే పలు లాభాలు ఉన్నట్లు భావిస్తున్నారు వైసీపీ నేతలు. కాపు ఓట్లను కొంత మేరకు చీల్చవచ్చని భావిస్తున్నారట. అంబటి రాయుడు రాకతో యువత నుంచి ఓట్లు కొల్లగొట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం గుంటూరు ఎంపీగా మాత్రమే కాకుండా వైసీపీ పార్టీ స్టార్ కాంపెయినర్‌గా రాయుడుని దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఎన్నికల బరిలో దిగక ముందే ప్రతి బంతికి సిక్స్ కొట్టాలని అంబటి రాయుడికి టార్గెట్‌ ఫిక్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.