Janasena Vs YSRCP :  పవన్ కల్యాణ్‌ను ఆయన దారిన ఆయనను వదిలేస్తే  ఎప్పట్లాగే వశాఖ వచ్చేవారు..జనవాణి నిర్వహించేవారు. తర్వాత వెళ్లిపోయేవారు.  ప్రభుత్వంపై విమర్శలు జనవాణి పెట్టినా పెట్టకపోయినాచేస్తారు. కానీ ఆయనను అడ్డుకున్నారు.హోటల్ నుంచి బయట అడుగు పెట్టనివ్వలేదు. ప్రసంగించనివ్వలేదు. దీని వల్ల ఆయన సైలెంట్‌గా ఉన్నారా అంటే అలాంటి చాన్స్ లేదు. ఎంత రచ్చ కావాలో అంత అయింది. పవన్ కల్యాణ్.. జనవాణి నిర్వహించుకుంటే ప్రభుత్వానికి.. పోలీసులకు వచ్చిన ఇబ్బందేమిటన్న చర్చ సామాన్యుల్లో జరగడానికి కారణం అయింది. అంతకు మించి ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన విశాఖ గర్జన గురించి డైవర్ట్ అవడానికి కూడా కారణం అయింది. మరి దీని వల్ల లాభపడింది.. వైఎస్ఆర్‌సీపీనా..? జనసేన పార్టీనా ?


రాజకీయాల్లో ఆటంకాలకు ఎంతో క్రేజ్  !


ఎవరైనా ఓ రాజకీయ నాయకుడు ఫలానా ప్రాంతానికి వెళ్తానని ప్రకటించిన తర్వాత సాఫీగా వెళ్లి వస్తే పెద్దగా హైలెట్ కాదు.  ఆయన ఆ కార్యక్రమంలో ఏం మాట్లాడారో మాత్రం మీడియా రిపోర్ట్  చేస్తుంది. అదే ఆ నాయకుడి పర్యటనను అడ్డుకుంటామని ఎవరైనా ప్రకటించిన తర్వాత .. ఆ పిలుపుకు హైప్ వస్తే.. ఆటోమేటిక్‌గా  ఆపర్యటనకు క్రేజ్ వస్తుంది. అలాంటిది స్వయగా ప్రభుత్వం.. పోలీసులు వందల మందిని మోహరిచి అడ్డుకుంటే... ఆ పర్యటన సూపర్ సక్సెస్ అయినట్లే. కావాల్సినంత పబ్లిసిటీ వస్తుంది. ఈ విషయం రాజకీయ నేతలకు తెలియనిదేం కాదు. ఆటంకాలు ఎదురైతే.. వీరోచితంగా వెళ్లి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవడం రాజకీయ నేతల స్టైల్. అందుకే ఇలాంటి అవకాశాలు ..  రాజకీయ పార్టీలు సామాన్యంగా ఇతర పార్టీల వారకి ఇవ్వవు. ముఖ్యంగా అధికార పార్టీలు అసలు ఇవ్వవు. కానీ ఇప్పుడు ఏపీలో భిన్నంగా జరుగుతోంది. విపక్షాలు రోడ్డెక్కకుండా చేసి.. వాటికి కావాల్సినంత ప్రచారాన్ని హైప్‌ను అధికార పార్టీ తెచ్చి  పెడుతోంది. 


విపక్ష నేతల్ని అడ్డుకుంటే ఎవరికి నష్టం !


ప్రధాన ప్రతిపక్ నేత చంద్రబాబునాయుడు ఓ సారి పల్నాడు పర్యటనకు వెళ్లాలనుకున్నారు. ఆయన వెళ్లకుండా పోలీసులు ఇంటి గేట్లకు తాళ్లు కట్టేశారు. ఓ సారి విశాఖ విమానాశ్రం నుంచి బయటకు వచ్చాక.. గంటల తరబడి నిలిపివేయించారు. వైసీపీ నేతలను ఆయన  వాహనానికి అడ్డం నిలబడేలా పోలీసులే సహకరించారు. చివరికి వెనక్కి పంపారు. ఆ తర్వాత తిరుపతిలోనూ ఇలాగే జరిగింది. ఇక లోకేష్ పర్యటనలనూ అడ్డుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ విశాఖ వస్తే అంతకు మించిన ప్రయారిటీ లేదన్నట్లుగా అడ్డుకున్నారు. అయితే ఇలా అడ్డుకున్న ప్రతీ సారి ఆ ఇష్యూ హైలెట్ అవుతోంది. రెండు , మూడు రోజుల పాటు చర్చనీయాంశమవుతోంది. పోలీసుల వైఖరిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. దీని వల్ల తలపెట్టిన కార్యక్రమం జరగకపోయినా విపక్ష పార్టీలకు అంతకు మించిన పబ్లిసిటీ వస్తుంది.  ప్రభుత్వం తీరుపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. 


వైఎస్ఆర్‌సీపీది వ్యూహాత్మక తప్పిదమా ? ప్రతీకారమా ?


వైఎస్ఆర్‌సీపీ వ్యూహాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులకు మరీ ఇంత వ్యూహం లేకుండా రాజకీయం ఎలా చేస్తున్నారన్నది అంతుబట్టకుండా ఉంది. విశాఖలో మూడు రాజధానుల కోసం గర్జన నిర్వహించారు. కానీ ఆవిషయం ఎవరూ చెప్పుకోవడం లేదు.  పవన్ కల్యాణ్ అడ్డుకోవడంపైనా అసలు చర్చంతా జరుగుతోంది. మూడు రాజధానుల అంశం పక్కకుపోయింది. ఇదే కాదు.. గత మూడున్నరేళ్లుగా జరుగుతోంది. అయితే ఇటీవలి కాలం వరకూ టీడీపీ నేతల్ని అలా అడ్డుకుంటున్నారు.ఇప్పుడు జనసేనను కూడా ఆ జాబితాలో చేర్చారు.  చివరికి అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనేందుకు పరిటాల శ్రీరామ్, గంటి హరీష్ ,  వంగవీటి రాధా రాజమండ్రికి వస్తే వారినీ అడ్డుకున్నారు.  కానీ వారు పాదయాత్రలో పాల్గొన్నారు. అడ్డుకునే ప్రయత్నం  చేయడం వల్ల ఎవరికి నష్టం జరిగింది. ?   ప్రతీకారం కోసమే ఇలా చేస్తున్నారని రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. రాజకీయంగా తమకు ఎదురు వస్తున్నారని వారిని ఎలాగైనా అణిచివేయాలన్న తాపత్రయంతోనే ఇలా చేస్తున్నారన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. 


ప్రభుత్వానికి నెగెటివ్ .. విపక్షాలకు పాజిటివ్ !


కారణం ఏదైనా కావొచ్చు కానీ ఒకప్పుడు స్వేచ్చగా పాదయాత్ర చేసిన జగన్ ఇప్పుడు విపక్ష పార్టీలు రాజకీయ కార్యకలాపాలు చేసుకోకుడా నియంత్రించాలనుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్న వాదన ఎక్కవగా వినిపిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి.. విపక్షాలను బలపరుస్తున్నట్లవుతుంది. వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ఈ అంశాన్ని ఆలోచించారో.. ఆవేశంలో లేకపోతే ప్రతీ స్వభావంతో ఈ చర్యలు తీసుకుంటున్నారో అన్ని పార్టీలకూ అర్థం కాని విషయం.