Guduru Mla Varaprasadarao Comments On Party: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎంపీగా పని చేసిన వరప్రసాదరావును గత ఎన్నికల్లో అధిష్టానం ఎమ్మెల్యేగా బరిలోకి దించింది. తిరుపతి జిల్లా పరిధిలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయనకు.. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు టికెట్ నిరాకరించిన అధిష్టానంపై శనివారం ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి.
సర్వేల పేరుతో..
సర్వేల పేరుతో ఎస్సీ నియోజకవర్గాలలో మాత్రమే 28 మంది అభ్యర్ధులను మార్చడం బాధాకరమంటూ వరప్రసాదరావు అధిష్టానాన్ని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తాను తిరుపతి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఐఏఎస్ పోస్టును వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, వైసీపీ కష్టకాలంలో ఉన్నపుడు పార్టీలో చేరానని గుర్తు చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను గడిచిన పదేళ్లలో చేశానని వరప్రసాదరావు పేర్కొన్నారు. క్రమశిక్షణతో, విధేయతతో పార్టీ కోసం పని చేసిన తనను అధిష్టానం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని వదులుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
'హామీ ఇచ్చి ఇలా చేశారు'
వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పానని, అలానే అంటూ హామీ ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థిని ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే ప్రకారం సీఎంకు 59% వస్తే, నాకు 57% వచ్చాయని, అయినా టికెట్ ఇవ్వకపోవడం బాధగా ఉందన్నారు. వైసీపీలో టిక్కెట్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ తో ఉన్న స్నేహం వల్ల ఆయన పిలిస్తే మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లినట్టు పేర్కొన్నారు. టికెట్ విషయం తాను పవన్ ను అడగలేదు, ఆయనా హామీ ఇవ్వలేదన్నారు. సామాజిక న్యాయం తన అజెండా అని, చివరి వరకు రాజకీయాల్లో, ప్రజల్లో ఉంటానని స్పష్టం చేశారు. నామినేటెడ్ గా ఇచ్చే పదవులు వద్దని, ఎన్నికలలో పోటీ చేయడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. ఎంపీగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో, లేక స్వతంత్రంగా పోటీ చేస్తానో త్వరలో చెబుతానన్నారు.