BJP Vs YSRCP :  భారతీయ జనతా పార్టీపై వైఎస్ఆర్‌సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.  ఏపీలో బీజేపీని "బాబు జనతా పార్టీ"గా మార్చారంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాజధానిలో బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టి బహిరంగసభ నిర్వహించారు. రాజధానిని తరలించే ప్రయత్నం చేసిన వైఎస్‌ఆర్‌సీపీపై ఆ పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ అంశంపై మీడియా సమావేశం పెట్టిన గడికోట శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు.  అమరావతి స్కామ్ క్యాపిటల్ అన్నది  BJP కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని డిక్లరేషన్ చేసి, న్యాయ రాజధానిపై ఎందుకు నోరు మెదపరనిన ప్ర‌శ్నించారు. బీజేపి నేత స‌త్య‌కుమార్ చెప్పేవ‌చ్ని చంద్రబాబు మాటలని మండిప‌డ్డారు. 


  మీడియాలో ఎక్కువ కవరేజ్ వస్తుందనే బీజేపీ నేతల విమర్శలు


డీసెంట్రలైజేషన్‌ని వ్యతిరేకించటమే బీజేపీ విధానమా అని నిల‌దీశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని విమర్శిస్తే.. ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుని కవరేజ్ ఎక్కువ ఇస్తుందనే ఆత్రంతో బీజేపీ నేత సత్య కుమార్ నోటికొచ్చినట్లు, వ్యక్తిగతంగా మాట్లాడటం దురదృష్టకరమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సత్యకుమార్‌​ ... అసత్య కుమార్ లా, సత్యదూరమైన మాటలు మాట్లాడారు. ఆయన మాటలను వైయస్సార్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.  తాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటూ.. రాష్ట్రపతి  ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతు కోరలేదని వ్యాఖ్యలు చేసి, ఆ పార్టీ అధిష్టానంతో చీవాట్లు తిన్న విషయం అందరికీ తెలుసన్నారు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉండాలనే ఆలోచనతో,  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి, కేసులకు భయపడి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరికో, సీఎం రమేష్‌కో... సత్యకుమార్‌ ఎప్పుడూ కొమ్ము కాస్తూన్నార‌ని విమ‌ర్శించారు.


BJP డిక్లరేషన్ ఏమైంది..?


కర్నూలులో హైకోర్టు పెట్టాలని భారతీయ జనతా పార్టీ  డిక్లరేషన్‌ చేసింది. అలాంటిది, మా ప్రభుత్వం వికేంద్రీకరణ చేయాలని విధానంగా తీసుకుని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటే..  ఆ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా, మీ చేతిలో ఉన్న అంశాన్ని, మీరు చేసిన డిక్లరేషన్ కు అనుకూలంగా ఎందుకు నిర్ణయం  చేయలేకపోతున్నారని అడుగుతున్నామన్నారు.  టీడీపీ హయాంలో అమరావతి రాజధాని పేరుతో లక్ష కోట్లు మింగేస్తున్నారంటూ మీరు చేసిన విమర్శలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. 


విశాఖకు అడుగడుగునా బాబు అడ్డు....


జీడీపీ పరంగా చూసినా, దేశంలోనే విశాఖ నగరం పదో స్థానంలో ఉంది. విశాఖను మరింతగా అభివృద్ధి చేసుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం, ఎక్కడ తన బినామీలకు నష్టం జరుగుతుందో అని, అమరావతి పాట పాడటంతో పాటు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకువచ్చి విశాఖ అభివృద్ధికి అడుగడుగునా అడ్డు తగులుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబుకు వెన్నుదన్నుగా సత్యకుమార్‌ లాంటివాళ్లు అమరావతి భజనలో భాగస్వామ్యులు అవుతున్నారని విరుచుకుప‌డ్డారు.


ప్రత్యేక హోదా,  పోలవరం, స్టీల్ ప్లాంట్ పై నోరు మెదపరా..?


రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిందని, దానిపై అసత్య కుమార్‌ ఎందుకు నోరు తెరవడం లేదు, మీకు ధైర్యం ఉంటే దానిపై మాట్లాడాలి. రాయలసీమను ఫ్యాక్షనిస్ట్‌ ప్రాంతంగా చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. మీ హయాంలో రాయలసీమకు ఏం మేలు చేశారు?. సీమలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారి హయాంలో, ఆ తర్వాత వైఎస్‌ జగన్  హయాంలోనే జరిగిందన్నారు.