Jogi Ramesh vs Vasantha Krishna Prasad: మైలవరం: ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయం రోజుకొక రంగు మారుతోంది. ఎవరు ఏ పార్టీలో ఉంటారో... ఎవరి సీటు ఎప్పుడు చిరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. కొంతమందికి అదృష్టం కలిసొచ్చి రాత్రికే రాత్రే జాక్ పాట్ కొడుతున్నారు. సంవత్సరం నుంచి నడుస్తున్న మైలవరం పంచాయితీకి ఎట్టకేలకు వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ తెరదించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించారు. పిల్లి, పిల్లి కొట్టుకుని రోట్టె ముక్క కోతికి అందించినట్లు.... మంత్రి జోగిరమేశ్‌(Jogi Ramesh) , సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ (Vasantha Krishna Prasad)మధ్య ఆధిపత్య పోరు కాస్త... తిరుపతిరావుకు కలిసొచ్చింది. నిన్నటి వరకు ఆయన పేరు కూడా నియోజకవర్గ ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ ఒక్కసారిగా అధికార పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ తిరుపతిరావు కైవసం చేసుకున్నారు .


వసంత పయనం ఎటు...
మైలవరం వైసీపీ అభ్యర్థిగా తిరుపతిరావును ప్రకటించడంతో సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ ఆయన ‌అభిమానుల్లో నెలకొంది. వైసీపీ(Ysrcp) అధిష్టానం ఈసారి తనకు మొండిచేయి చూపిద్దని తొలుత గ్రహించింది ఆయనే....చాలారోజులుగా ఆయన వైసీపీ అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకూ అంటీముట్టనట్లుగానే హాజరవుతున్నారు. మంత్రి జోగి రమేశ్‌(Jogi Ramesh)తో ఉన్న విభేదాలను సీఎం జగన్ పరిష్కరించకపోవడం... సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాను ఉన్నా పదేపదే మంత్రి తన నియోజకవర్గంలో జోగ్యం చేసుకున్నా సీఎం జగన్ మందలించకపోయినప్పుడే వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad) ఈసారి తనకు టిక్కెట్ రాదని అంచనా వేశారు. అప్పటి నుంచే ఆయన తెలుగుదేశం(Tdp) నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. 


ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్ ఎప్పుడైన చీకటి పడొచ్చంటూనే....కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు కూడా చెల్లించలేపోతోందని ఆరోపించారు. గ్రామాల్లోకి వెళితే ప్రజలు అభివృద్ధిపై ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ఈనెల 5న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాజకీయ భవిష్యత్‌ పై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఖచ్చితంగా ఆయన పార్టీని వీడతారన్న సమాచారం మేరకే... ముందుగానే వైసీపీ అధిష్టానం ఇంఛార్జిని మార్చివేసింది..


టిక్కెట్ హామీ దక్కిందా...?
చాలా రోజులుగా తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరుగుతున్న వసంతకృష్ణ ప్రసాద్‌కు ఆపార్టీ టిక్కెట్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారని వసంత అనుచరులు అంటున్నారు. అయితే ఆయన మైలవరం(Mylavaram) నుంచే పోటీలో ఉంటారా లేక మరో నియోజకవర్గానికి మారతారా అన్నది మాత్రం సస్పెన్సే... మైలవరంలో ఇప్పటికే పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలోనే ఉన్న దేవినేని ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ పనిచేసి ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. అంతటి కీలక నాయకుడిని కాదని వసంత కృష్ణప్రసాద్‌కు మైలవరం టిక్కెట్ ఇస్తారా అన్నది అనుమానమే. 
విజయవాడ సిటీలో మూడు సీట్లు మినహాయిస్తే... విజయవాడ లోక్‌సభ పరిధిలో మిగిలిన నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండు ఎస్సీ రిజర్వుడు సీట్లే. జగ్గయ్యపేటలో తెలుగుదేశం అభ్యర్థి శ్రీరాం తాతయ్య సైతం బలమైన అభ్యర్థే. కాబట్టి వసంత కృష్ణప్రసాద్‌కు తెలుగుదేశం ఎలాంటి హామీ ఇచ్చిందో తెలియడం లేదు. అయితే మైలవరం టిక్కెట్ కోసం తీవ్రంగా పోటీపడి నిరాశ చెందిన జోగి రమేశ్‌ మాత్రం... తన అనుచరుడు తిరుపతిరావు యాదవ్‌కు టిక్కెట్ ఇప్పించుకుని వసంతపై పైచేయి సాధించారు.