ఏపీ తరహా రాజకీయాలు తెలంగాణలో రిపీట్ కాబోతున్నాయా ? అప్పుడు అబ్బాయికి అండగా ఉన్న అమ్మ ఆంధ్రా రాజకీయాల్లో మార్పు తెస్తే ఇప్పుడు అమ్మాయి కోసం అమ్మ ఆందోళన ఎలాంటి మార్పు తెస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత రెండుమూడు రోజులుగా తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ వైఎస్సార్‌టీ మధ్య సాగుతున్న వార్ అరెస్ట్‌ల వరకు వెళ్లింది. దాడులతో ఆగిపోతుందనుకుంటే ఇప్పుడు అరెస్ట్‌లకు దారితీయడమే కాకుండా వైఎస్ కుటుంబం రంగంలోకి దిగే వరకు వచ్చింది.
నిరసన తెలిపేందుకు ప్రగతిభవన్‌కి వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె వెళ్తున్న వాహనాలపై దాడి జరిగింది. అయినా వెనక్కి తగ్గని షర్మిల దాడిలో దెబ్బతిన్న వాహనాలతోనే ప్రగతి భవన్‌వైపు దూసుకెళ్లారు. ఈ లోపే పోలీసులు కారుతోపాటు షర్మిలను ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌టీ పార్టీ శ్రేణులు నిరసన తెలపడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కి షర్మిలని తరలించడంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న షర్మిల తల్లి విజయమ్మ కూడా పోలీస్ స్టేషన్‌కి బయలుదేరడానికి ప్రయత్నించారు. పోలీసులు ముందస్తుగానే ఆమెను హౌజ్ అరెస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఇంటిలోనే నిరసనకు దిగారు. ప్రజాసమస్యలను ప్రశ్నిస్తే తన కూతురిని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు విజయమ్మ. అధికార గర్వంతో తన కూతురిపై దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఆమెకి గాయాలయ్యాయని కన్నీరు దిగమింగుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏం తప్పు చేసిందని షర్మిలని అరెస్ట్ చేశారని కెసిఆర్ సర్కార్‌ని నిలదీశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ మేము ప్రభుత్వాలు నడిపామన్నారు.
షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా షర్మిల అరెస్ట్‌ని తప్పుబట్టారు. ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని విమర్శించారు. విజయమ్మ కంటతడి పెట్టుకుంటూ మాట్లాడిన మాటలు తెలంగాణలో రాజకీయమార్పుకు కారణమవుతాయన్న అన్న వాదన కూడా వినిపిస్తోంది. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలు, జగన్ అరెస్ట్ , రాష్ట్ర విభజన అనంతరం విపక్షాల విమర్శలు వంటి పలు ఘటనలతో వైఎస్ విజయమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. కొడుకు జగన్‌కి అండగా ఉంటూ వైసీపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. జగన్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమంలోనూ పాల్గొనడమే కాదు ఎన్నికల ప్రచారంలోనూ ఉండి తన కొడుక్కి అవకాశం ఇవ్వమని ఏపీ ప్రజలను కోరారు. విపక్షాల విమర్శలకు ఘాటుగానే స్పందిస్తూ సెంటిమెంట్ తో ప్రజల మనసును దోచారు విజయమ్మ. ఫలితంగా 2014 ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా వైసీపీ నిలిచింది. 2019లో భారీ మెజార్టీతో జగన్ సిఎం అయ్యారు.
కొడుకు ముఖ్యమంత్రి కోరిక నెరవేరే వరకు జగన్ వెంటే నడిచిన విజయమ్మ ఇప్పుడు కూతురి కోసం మళ్లీ రంగంలోకి దిగారు. వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమే కాదు తన మకాంని హైదరాబాద్‌కి మార్చేశారు. కూతురికి అండగా ఉండేందుకే వచ్చానని చెప్పిన విజయమ్మ ఇప్పుడు షర్మిల అరెస్ట్ తో మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. ఏ తల్లికైనా తన బిడ్డ కష్టంలో ఉంటే బాధగానే ఉంటుంది. విజయమ్మ కూడా షర్మిల అరెస్ట్‌ని నిరసిస్తూ ఆమెని చూడటానికి వీల్లేకుండా చేసిన కెసిఆర్ తీరుని తప్పుబడుతూ కంటతడి పెట్టారు. ఈ సీన్ రానున్న ఎన్నికల్లో మార్పు తెస్తుందని రాజకీయవిమర్శకులు అంటున్నారు. వైఎస్‌ఆర్‌టీ పార్టీకి మంచి రోజులు రానున్నాయని జోస్యం చెబుతున్నారు.