YS Sharmila Sensational Tweet On Social Media Posts: సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా అని.. అలాంటి వ్యవస్థను కొందరు సైకోలు, సైకో పార్టీలతో కలిసి భ్రష్టు పట్టించారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ ఆమెకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా మారారని విమర్శించారు. 'తల్లి, చెల్లి అనే ఇంగిత జ్ఞానం లేకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షసానందం పొందారు. సోషల్ మీడియా సైకో బాధితుల్లో నేను కూడా ఉన్నా. అసభ్యకర పోస్టులతో పరువు, ప్రతిష్ట దెబ్బతీసే పోస్టులు పెట్టారు. అలాంటి పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాతో సహా నా తల్లి విజయమ్మ, సునీతలపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని అవమానించారు. నా ఇంటి పేరు కూడా మార్చి శునకానందం పొందారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రరెడ్డిపై కేసు పెట్టాను. సైకోలా పోస్టులు పెట్టిన అతని అరెస్టును స్వాగతిస్తున్నా. దారుణమైన పోస్టులు పెట్టే వారు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాలి.' అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.






విద్యుత్ ఛార్జీలపై షర్మిల ధర్నా


రాష్ట్ర ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపారని షర్మిల మండిపడ్డారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె లాంతరుతో పాల్గొన్నారు. 'కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 5 నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. అత్యంత దారుణంగా కరెంటు ఛార్జీల భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదన్నట్లుగా ఇంకో రూ.11వేల కోట్లు సిద్ధం చేశారు. మొత్తం రూ.17 వేల కోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు గారు ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలపై ఎన్నో హామీలు ఇచ్చారు. వైసీపీ 9 సార్లు ఛార్జీలు పెంచిందని గగ్గోలు పెట్టారు. టీడీపీ అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదంటూ ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలో వచ్చాకా మాట మార్చారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ? ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరా ? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రూ.35 వేల కోట్లు భారం మోపితే... మీ 5 నెలల పాలనలో రూ.17 వేల కోట్లు భారమా ? ఇది న్యాయమా చంద్రబాబు ? విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి అన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపుతారా ?' అంటూ ప్రశ్నించారు.






Also Read: YS Jagan On DGP: అందర్నీ గుర్తు పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం - పోలీసు అధికారులకు జగన్ హెచ్చరికలు