YSRTP NEWS: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూతురిగా తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన వై.ఎస్.షర్మిల పాలేరుపై కన్నేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆది నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించిన షర్మిల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాలేరును ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు సైతం అధికంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ్నుంచే పోటీ చేసేందుకు సముఖత చూపిస్తున్నట్లు సమాచారం. గత రెండు నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల పాలేరు తాను పోటీ చేసేందుకు అనుకూలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న వైఎస్సార్ అభిమానులు ఆయన కూతురిగా తనకు ఆదరణ కల్పిస్తారనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాలేరు నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పాలేరు నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
2014 ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీకి ఆదరణ..
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీకి ఆదరణ కలిగినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో టీఆర్‌ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ అభిమానులు తనకు సహకరిస్తానే భావనతో పాలేరు నుంచి షర్మిల పోటీ చేసేందుకు సముఖుత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పాలేరులో రెడ్డి సామాజిక వర్గం సైతం బలంగా ఉంది. ఇది కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.
రాంరెడ్డి అభిమానులపై గురి..
పాలేరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. ఆయన మరణాంతరం రాంరెడ్డి కుటుంబీకులు రాజకీయాలకు దూరంగానే ఉంటుండటంతో క్యాడర్ తలోదిక్కుగా మారిపోయారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్‌రెడ్డికి రాంరెడ్డి క్యాడర్ పూర్తిస్థాయిలో పని చేయడంతో మాజీ మంత్రి తుమ్మల లాంటి వ్యక్తిపై ఉపేందర్ రెడ్డి విజయం సాదించారు. ఈ నేపథ్యంలో రాంరెడ్డి వెంకట రెడ్డికి వైఎస్సార్ ఉన్న సంబంధం నేపథ్యంలో ఆయన అనుచరులు కూడా వైఎస్సార్‌పై ప్రత్యేక అభిమానం చాటుకుంటారు. ఈ సమీకరణాలన్ని తనకు కలిసివస్తాయనే బావిస్తున్న షర్మిల వైఎస్సార్ టీపీ నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న వైఎస్సార్ అభిమానులు షర్మిలకు సహకరిస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే.