Ys Sharmila Contesting From Kadapa Parliament: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) పోటీ చేయనున్నారు. కడప నుంచి పోటీ చేయాలని ఆమెపై కాంగ్రెస్ (Congress) అధిష్టానం ఒత్తిడి తెచ్చింది. హస్తం పెద్దల కోరిక మేరకు ఆమె కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయనున్నారు. అటు, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేలా షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖలో 'న్యాయ సాధన సభ' పేరిట నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు షర్మిలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, త్వరలోనే తొలి జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ముమ్మరం చేసేలా షర్మిల నేతలు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 


'ప్రజాగళం' సభపై విమర్శలు


కాగా, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 'ప్రజాగళం' సభపై షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు చంద్రబాబును, ఇటు జగన్ ను 2 పంజరాల్లో పెట్టుకుని ఆడిస్తోన్న రింగ్ మాస్టర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. పదేళ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించిన పార్టీ బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అంటూ ఆమె నిప్పులు చెరిగారు. 'కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని ప్రధాని మోదీ కూతలా? ఐదేళ్లుగా జగన్ తో అంటకాగిందెవరు. వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకోకుండా, ఎదురు వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది బీజేపీ. ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పుతెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో,? దత్తపుత్రుడు అన్నది ఎవరినో.?' అంటూ సెటైర్లు వేశారు. 






సీఎం జగన్ పై విమర్శలు


కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు సిగ్గువిడిచి సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి సర్కారు అని షర్మిల ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టపెట్టి, వారికీ రాజ్యసభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు అని ఆరోపించారు. ఇది వీరి స్నేహం, విడదీయరాని బంధం అంటూ జగన్ పై సెటైర్లు వేశారు. 'హామీలు ఇచ్చింది కాంగ్రెస్, వాటిని తుంగలో తొక్కింది బీజేపీ, టీడీపీ, వైసీపీ. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రస్ మీద పసలేని దాడులు చేస్తున్నారు. అంటే కాంగ్రెస్‌కు మీరు భయపడుతున్నారా.?' అని బీజేపీని వైఎస్ షర్మిల నిలదీశారు. 


Also Read: APPSC Group1 Prelims: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' పరీక్ష ప్రశాంతం, ప్రిలిమ్స్‌కు 72.55 శాతం అభ్యర్థులు హాజరు