TDP Vs YSRCP Local Body Elections Strategy:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు అసలు వద్దు.. ప్రతీ చోటా పోటీకి దిగి తీరాల్సిందే  అంటూ ఆయన పార్టీ శ్రేణులకు  దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనని తేల్చేశారు. ఇదే జగన్ గతంలో  అధికారంలో ఉన్న సమయంలో జరిగిన స్థానిక పోరులో సరికొత్త రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు నమోదు కావడం, ఇప్పుడు దానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యానించడమే దీనికి ప్రధాన కారణం.

Continues below advertisement

జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏకగ్రీవాల హవా

వైసీపీ పాలనా కాలంలో   జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ఏకగ్రీవాల హవా ఎంతలా సాగిందో అర్థమవుతుంది. ఆనాడు రాష్ట్రంలో మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఏకంగా 126 స్థానాలు పోటీ లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. ఇక ఎంపీటీసీల విషయానికొస్తే మొత్తం 9,696 స్థానాలకు ఎన్నికలు ప్రకటిస్తే, రికార్డు స్థాయిలో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 2,271కి పైగా స్థానాలను అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే సొంతం చేసుకుంది.  2021 స్థానిక పోరులో పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు వేల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కానీ నేడు ప్రతిపక్షంలోకి రాగానే జగన్ ఏకగ్రీవాలకు స్వస్తి పలికి ఓటింగ్ జరగాల్సిందే అని పట్టుబట్టడం రాజకీయ శైలిలోని వ్యూహాత్మక మార్పును సూచిస్తోంది.

Continues below advertisement

నాడు వైసీపీ తీరుపై అనేక విమర్శలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు నాటి అధికార పార్టీ ఏకగ్రీవాల దిశగా వేగంగా అడుగులు వేసింది. నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 13,097 పంచాయతీలకు గాను 2,196 పంచాయతీలు, అలాగే 1,31,325 వార్డులకు గాను 47,400 కంటే ఎక్కువ వార్డు స్థానాలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఇక పట్టణ స్థానిక సంస్థల్లో చూస్తే.. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల్లోని మొత్తం 2,711 వార్డులలో 590 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 37 డివిజన్లు, కడప కార్పొరేషన్ పరిధిలోనూ సింహభాగం ఏకగ్రీవాలు  అయ్యాయి. 

ఇప్పుడెందుకు ఏకగ్రీవాలు వద్దు!

 ఇప్పుడు వైఎస్ జగన్ ఏకగ్రీవాలు వద్దు  అని చెప్పడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ క్రక్స్ స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకే ఏకగ్రీవాలు చేసుకునేందుకు ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉంటాయి. అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థతో పాటు స్థానిక ప్రభావం కూటమి వైపు ఉండే అవకాశం ఉంది కాబట్టి.. ఈ సమయంలో ఏకగ్రీవాలకు మొగ్గు చూపితే ప్రత్యర్థి  పార్టీలే మెజారిటీ స్థానాలను పోటీ లేకుండా కైవసం చేసుకుంటాయనే ముందస్తు అంచనా జగన్‌లో ఉంది.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయి కేడర్‌ను యాక్టివ్‌గా ఉంచడం అత్యంత ముఖ్యం. ఏకగ్రీవాలకు ఒప్పుకుంటే గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు నిరాశకు గురవుతారు.  ఓటింగ్ వరకు వెళ్తేనే అధికార కూటమిని నిలదీసే అవకాశం లభించడమే కాకుండా, రాబోయే రోజుల్లో కేడర్‌లో ఉత్సాహం నింపవచ్చని జగన్ భావిస్తున్నారు. అందుకే ఏకగ్రీవాల ప్రక్రియను నిరోధించడం ద్వారా కూటమికి సులువైన విజయం దక్కకుండా అడ్డుకోవాలనేది వైసీపీ వ్యూహం.

వైసీపీ కోసం ఏకగ్రీవాలకు ప్రయత్నించవచ్చుగా!

 ఈ నిర్ణయంలో ఒక రాజకీయ వైరుధ్యం  కూడా కనిపిస్తోంది. తమ హయాంలో ఏకగ్రీవాలు జరిగినప్పుడు వాటిని  సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు అని సమర్థించుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు జరిగితే  అది అక్రమమే, బెదిరింపుల వల్లే జరుగుతోంది  అనే ప్రచారం చేయడానికి సిద్ధమవ్వాల్సి వస్తోంది. ఏది ఏమైనా.. అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను ప్రోత్సహించడం, ప్రతిపక్షంలోకి రాగానే వాటిని వ్యతిరేకించడం అనేది ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా వస్తున్న అధికార-ప్రతిపక్షాల పాత ఫార్ములానే అని చెప్పవచ్చు.