Jagan Cockroach strategy AP politics:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న పిలుపులు, వేస్తున్న పావులు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆయన సాగిస్తున్న సుదీర్ఘ పోరాటంలో.. అనూహ్యంగా అధికార కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీలను లక్ష్యంగా చేసుకోవడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఎన్ని రకాల వివరణలు ఇచ్చినా, గణాంకాలు ముందుంచినా డీఎస్సీపై తన ఆరోపణలకే కట్టుబడి ఉన్న జగన్.. ఈ క్రమంలో  టీడీపీతో సాగుతున్న కూటమి నుంచి బీజేపీ, జనసేన తక్షణమే బయటకు రావాలి అని డిమాండ్ చేయడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందనేది ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

బీజేపీతో జగన్‌కు సానూకూల సంబంధాలు

గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో జగన్‌కు ఉన్న సాన్నిహిత్యం బహిరంగ రహస్యమే. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలోకి వచ్చాక కానీ ఆయన కేంద్ర ప్రభుత్వంపై లేదా ప్రధాని మోదీపై నేరుగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. అలాంటి జగన్, ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి నుంచి బీజేపీ, జనసేన వైదొలగాలని గొంతు ఎత్తడం వెనుక ప్రధానంగా కూటమి ఐక్యతను దెబ్బతీసే పెద్ద వ్యూహం దాగి ఉందనేది పొలిటికల్ ఎనలిస్ట్‌ల ప్రాథమిక అంచనా. 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్లే వైఎస్‌ఆర్‌సీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా భవిష్యత్ సమరాల నాటికి ఈ  బంధంలో చీలికలు తెస్తే తప్ప, రాజకీయంగా కోలుకోవడం కష్టమనే ఆలోచనతోనే జగన్ ఈ డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారని భావించవచ్చు.

Continues below advertisement

కాక్రోచ్‌ అవుతా అంటున్న జగన్ 

 డీఎస్సీ వివాదాన్ని కేవలం విద్యాశాఖ ,  టీడీపీ ప్రభుత్వ వైఫల్యంగా మాత్రమే కాకుండా, మొత్తం కూటమి ప్రభుత్వ నైతిక వైఫల్యంగా చిత్రించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మండిపడుతున్న ఆయన, ఈ పాపంలో బీజేపీ, జనసేనలు కూడా భాగస్వాములు కాకూడదంటే వెంటనే బయటకు రావాలని నైతిక ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాల్లో అంతర్గత అనుమానాలను, విభేదాలను రేకెత్తించడం ద్వారా టీడీపీని ఒంటరిని చేయాలనేది జగన్ వ్యూహంలో భాగం.  ఇటీవల కాక్రోచ్ కామెంట్స్, పోరాట వ్యూహాలపై జగన్ మాట్లాడిన తీరును చూస్తే.. ఇది కేవలం కూటమిని విచ్ఛిన్నం చేసే వ్యూహమే కాకుండా, రాబోయే రోజుల్లో కేంద్రంలోని బీజేపీపై కూడా పూర్తిస్థాయిలో వ్యతిరేక గళం విప్పడానికి ఇస్తున్న ముందస్తు సంకేతామా అనే కోణంలోనూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇన్నాళ్లూ కేంద్రంతో మైత్రిని కొనసాగించినా తమకు దక్కిన రాజకీయ ప్రయోజనం ఏమీ లేదని, ప్రతిపక్షంగా నిలదొక్కుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒకేసారి విరుచుకుపడటమే ఏకైక మార్గమని వైఎస్‌ఆర్‌సీపీ భావిస్తూ ఉండవచ్చు.

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే!

ఈ విమర్శలు ఫలిస్తాయా అంటే ఆచరణలో అది సాధ్యపడేలా కనిపించడం లేదు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన, కేంద్రంలోని బీజేపీ నాయకత్వం టీడీపీతో అత్యంత బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాయి. జగన్ చేస్తున్న ఈ డిమాండ్లను కూటమి నేతలు తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. తన సొంత రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి జగన్ ఆడుతున్న మైండ్ గేమ్  ఇది తప్ప, దీనివల్ల కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం శూన్యమని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది.  డీఎస్సీ అక్రమాల నెపంతో కూటమి పునాదులను కదిలించేందుకు జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందో లేక కేవలం ఒక రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందో వేచి చూడాలి.